DPROADB- అకస్మాత్తుగా కుప్పకూలి పోయి మరణాలు సంభవించకుండా సి.పి.ఆర్. సేవలు అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.పి.ఎస్.

మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవం రోజున వంద ఆరోగ్య మహిళ కేంద్రాలనుప్రారంభిస్తుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం రోజున బిఆర్కే భవన్, హైదరాబాదు నుండి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి తో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులకు సిపిఆర్, కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, వడ్డీలేని రుణాలు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అకస్మాత్తుగా కుప్పకూలి పోయి మరణాలు సంభవించకుండా సి.పి.ఆర్. సేవలు అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీ లు, ప్రజా ప్రతినిధుల నేతృత్వంలో సిపిఆర్ పద్దతిలో అపస్మారక స్థితిలో కుప్పకూలి పడిపోయిన వారికి అత్యవసర సేవలు అందించేందుకు అవగాహన కల్పించాలని, అందుకు జిల్లాలకు శిక్షకులను పంపిస్తామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, ఆశ, ఏఎన్ఎం, కళాశాలల విద్యార్థులు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్స్ లలోని వారికి అత్యవసర సేవలపై అవగాహన కల్పించాలని అన్నారు. అవసరమైన ఎక్విప్ మెంట్ సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం 24వేల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పటిష్టంగా, కలెక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో సజావుగా, ఎక్కవ మందికి కళ్ళ పరీక్షల స్క్రీనింగ్ నిర్వహించాలని అన్నారు. ఈ నెల 8 న మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మహిళా క్లినిక్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుందని, అనుమానితులకు, లక్షణాలు ఉన్న వారికి జిల్లా స్థాయిలో మామోగ్రామ్, బయాప్సి, పాప్స్ మీర్, కోల్పోస్కోపి పరిక్షలు నిర్వహించి, క్యాన్సర్ నిర్థారణ జరిగితే నిమ్స్ ఎంఎన్ జే లో చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళా క్లినిక్ కు వచ్చే పేషెంట్ల వివరాలు ప్రత్యేక యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని, వీటిని రిఫరల్ ఆసుపత్రికి లింక్ చేస్తామని, జిల్లా ఆసుపత్రిలో ఇబ్బందులు కల్గకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో త్వరితగతిన సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులు, ఇతర మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
గ్రామాలు, పట్టణాల్లో విసృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. 2018-19, 2019-20 ఆర్థిక సంఘం క్రింద వడ్డీలేని రుణాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేయాలని అన్నారు. ఇందుకు 650 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళా కార్యక్రమాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. వైద్య శాఖ సేవల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయని, వైద్య శాఖ అధికారులను మంత్రి అభినందించారు. వడ్డీలేని రుణాల చెక్కులను మహిళా సంఘాలు వారి అవసరాలకు వినియోగించుకునే విధంగా చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్లతో సమీక్షిస్తూ, జిఓ 58, 59, 76, 118 భూముల క్రమబద్దీకరణ, పోడు భూములు, తెలంగాణకు హరితహారం, తదితర అంశాలపై సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. మాట్లాడుతూ, ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని శాసన సభ్యుల అంగీకారంతో కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని విజయవంతమైన మహిళా సంఘాల సభ్యులను ఆహ్వానించాలని సూచించారు. ఈ నెల 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా కార్మికులను, ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలను సన్మానించాలని సూచించారు. సిపిఆర్ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు పరచడానికి షెడ్యూల్ ను తయారుచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. పట్టణంలోని రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంఘీక సంక్షేమ శాఖ ద్వారా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో గతంలో సేకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం గుర్తించి నివేదిక సమర్పించాలని అన్నారు. ఉద్యానవన కార్యక్రమాలను వేగవంతం చేయాలనీ హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. జిఓ 59 కు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అన్నారు. 15 వ ఆర్థిక సంఘం నుండి విడుదలైన నిధులను జిల్లా హెల్త్ సొసైటీకి ప్రభుత్వ నిబంధనల మేరకు బదలాయించాలని జడ్పీ సీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ట్రైనీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీఓ రమేష్ రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి దిలీప్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జడ్పీ సీఈఓ గణపతి, మున్సిపల్ కమీషనర్ శైలజ, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post