ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. సోమవారం రోజున జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిబంధనల ప్రకారం చేపట్టాలని అన్నారు. రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసుకున్న అర్హత కలిగిన ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, దరఖాస్తు చేసుకున్న వారి కోరిక మేరకు ఖాళీలను అనుసరించి బదిలీలు చేపట్టాలని సూచించారు. సీనియార్టీ విషయంలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి దరఖాస్తు దారునికి పూర్తీ సమాచారాన్ని వ్రాత పూర్వకంగా అందించాలని అన్నారు. బదిలీల నేపథ్యంలో పదవతరగతి విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. పదవతరగతి లో 35 శాతం, 50 శాతం లోపు మార్కులు కలిగిన సబ్జెక్టు వారీగా విద్యార్థులు వివరాలను అందించాలని అన్నారు. అదేవిధంగా ఈ విద్య సంవత్సరంలో పదవతరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఏ ఒక్కరు కూడా ఫెల్ కాకుండా ముందస్తు రివిజన్ నిర్వహించాలని సూచించారు. పదవతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 9.5,10 గ్రేడ్ ఉత్తీర్ణత సాధించే విధంగా ఆయా హెడ్ మాస్టర్లు హామీ ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశం లో జిల్లా విద్యాశాఖ అధికారిణి టి.ప్రణీత, సెక్టోరల్ అధికారులు నర్సయ్య, నారాయణ, సుజత్ ఖాన్, ఉదయ శ్రీ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.