DPROADB-ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలి.. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేయండి- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తావివ్వకుండా పద్ధతి ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రోజున హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు గాను ఖాళీల వివరాలు, సీనియారిటీ జాబితాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా నిర్వహించాలని, కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేయాలనీ, అన్ని అంశాలములతో కూడిన పాఠశాలలను మాత్రమే ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని తెలిపారు. జిల్లా కలెక్టర్లు మన ఊరు- మన బడి పనులను పర్యవేక్షించి ప్రతి మండలానికి రెండు చొప్పున ప్రారంభించేలా చూడాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సీనియార్టీ, ఖాళీల వివరాలకు సంబంధించిన జాబితాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమం క్రింద జిల్లాలో ప్రతి మండలానికి రెండు చొప్పున 18 మండలాల్లో 37 మోడల్ పాఠశాలలు సిద్ధం చేస్తున్నామని, ఇప్పటివరకు 18 పాఠశాలల్లో వందశాతం పనులు అన్ని అంశములలో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారిణి టి.ప్రణీత, సెక్టోరల్ అధికారి నారాయణ, డిపిఓ శ్రీపాద్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post