కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. గురువారం రోజున ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయితీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిభిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన పక్షంలో రీడింగ్ కళ్లద్దాలు, ప్రిస్క్రిప్టెడ్ అద్దాలను సిఫారసు చేయాలనీ వైద్యులకు సూచించారు. ఏ ఒక్కరు కూడా మిగలకుండా అర్హత గల వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించే విధంగా ప్రతి వాడవాడల తిరిగి అవగాహన కల్పించాలని అన్నారు. ఆశలు, ANM లు, వారి పరిధిలో ఉన్న గృహాల కుటుంబాల వారికి వివరించాలని సూచించారు. పరీక్షలు నిర్వహించిన వివరాలను యాప్ లో పొందుపరచాలని అన్నారు. ఈ సందర్బంగా డేటా ఎంట్రీ వివరాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ పీఠాధిపతి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ కు శాలువాతో సన్మానించి నాగదేవత చిత్రపటాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని, మెస్రం వంశీయులు పోగు చేసిన సొమ్ముతో దేవాలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. మున్ముందు దేవాలయం పరిధిలో చేపట్టాల్సిన పనులపై మరోసారి సందర్శించి సమావేశం ఏర్పాటు చేసి తెలుసుకుంటానని దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, తహసీల్దార్ సోము, ఎంపీడీఓ పుష్పలత, సర్పంచులు రేణుక, గాంధారి, ఆలయ పీఠాధిపతి, ఆలయ ఈఓ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.