DPROADB- పట్టణాలతో సమానంగా పల్లెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.

పట్టణాలతో సమానంగా పల్లెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, వివిధ శాఖల అధికారులతో పల్లె ప్రగతి, సేగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, హరితహారం, పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ఉపాధి హామీ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె ప్రకృతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి పల్లెల అభివృద్ధి కోసం కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న గ్రామపంచాయితీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతుల సమస్యలు, చర్చలు, శిక్షణలు, పంటల సాగు కోసం రైతు వేదికలను క్లస్టర్ పరిధులలో ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నదని అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితే జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. మండల స్థాయిలో మండల పరిషత్ అధికారుల నేతృత్వంలో గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆదిలాబాదు జిల్లా రాష్ట్రంలో వివిధ అంశాలలో ప్రగతి సాధిస్తున్నదని, రానున్న కాలంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఒక టీమ్ వర్క్ తో అధికార యంత్రాంగం పని చేయాలనీ అన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో జరుగుచున్న కార్యక్రమాలను త్వరలో పర్యటించి పర్యవేక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. వచ్చే వర్షాకాలంలో జిల్లాలో టైఫాయిడ్ జీరో స్థాయికి తీసుకురావాలని, ఏ ఒక్క టైఫాయిడ్ కేసు నమోదు కాకుండా చూడాలని అన్నారు. గ్రామాలలో నీటి నిల్వలు, బహిరంగ మల విసర్జన జరుగకుండా, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి కార్యక్రమాలు సజావుగా నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. మరుగుదొడ్లు లేని గృహాల్లో నిర్మించుకునే విధంగా ప్రోత్సహిస్తూ వచ్చే జూన్ 2 నాటికీ వందశాతం నిర్మాణాలు పూర్తిచేయాలని అన్నారు. నిర్మించుకున్న మరుగుదొడ్లను వినియోగం లోకి తీసుకువచ్చే విధంగా ప్రజలకు అవగాహనా కల్పించాలని, తద్వారా ఎలాంటి రోగాలు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చని అన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇంటిలోని మురికి నీరు బయటికి వెళ్లకుండా ఇంకుడు గుంతలోకి వెళ్లే విధంగా నిర్మించుకోవాలని అన్నారు. వచ్చే జూన్ 2 నాటికీ వందశాతం ఇంకుడు గుంతలు నిర్మాణాలు పూర్తిచేయాలని అన్నారు. తడి, పొడి చెత్తను ఇంటింటి నుండి సేకరించి సేగ్రిగేషన్ షెడ్లకు తరలించి సాంకేతిక శాస్త్రీయ పద్దతిలో ఎరువును తయారు చేయాలనీ అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. మరణించిన వారికీ గౌరవ ప్రధానంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రతి గ్రామపంచాయితీలో వైకుంఠధామల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వాటిని పూర్తి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎంపీడీఓ ల పర్యవేక్షణ చేయాలనీ అన్నారు. ప్రతి గ్రామపంచాయితీ, మండలంలో పారా మీటర్స్ తో కూడిన నివేదికలు సమర్పించవలసి ఉంటుందని సూచన ప్రాయంగా తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని, భూములు లభ్యం కానీ చోట్ల, మూడు, నాలుగు కలిపి ఒకే చోట ప్రాంగణాలు నిర్మించాలని సూచించారు. ఈ నెల 20 నాటికి క్రీడా ప్రాంగణాలు పూర్తిచేయాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలను నాటి సంరక్షించాలని, మొక్కలు చనిపోయిన స్థానంలో కొత్త మొక్కలు నాటడం, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని అన్నారు. వచ్చే సంవత్సరానికి గాను నర్సరీలలో అవసరానికి సరిపడా మొక్కలను పెంచాలని అన్నారు. ఇప్పటికే బ్యాక్ ఫిల్లింగ్, సీడ్ కలెక్షన్, తదితర పనులు పూర్తిచేయాలని అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కార్యక్రమం క్రింద పాఠశాలల్లో నిర్మించే మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ నిర్మాణాలు పూర్తిచేయాలని అన్నారు. వచ్చే విద్య సంవత్సరం నాటికి మొదటి విడతలో ప్రతిపాదించిన పాఠశాలల మరమ్మతులు, ఇతర పనులను పూర్తిచేయాలని అన్నారు. ఉపాధి హామీ కార్యక్రమం క్రింద ప్రతి గ్రామపంచాతిలో రోజుకు 50 మంది కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. ఎప్పటికప్పుడు FTP లను అప్లోడ్ చేయాలనీ అన్నారు. ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఉపాధి హామీ పనులపై సామజిక తనిఖీలో ఎలాంటి అభ్యంతరాలు రాకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలని అన్నారు. బ్యాంకు లింకేజి క్రింద ఇప్పటివరకు 79 శాతం ప్రగతి సాధించామని, ఈ సంవత్సరం ముగిసే నాటికి వందశాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. రుణాల తిరిగి చెల్లింపులో సంబంధిత సిబ్బంది మహిళా సంఘాల సభ్యులతో కలిసి రుణాల చెల్లింపు విషయంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జడ్పీ సీఈఓ గణపతి, డిఆర్డిఓ కిషన్, డిపిఓ శ్రీనివాస్, అదనపు డిఆర్డిఓ రవీందర్ రాథోడ్, డివిజనల్ పంచాయితీ అధికారులు, ఎంపీడీఓ లు, ఎపిడి, ఎపిఓ, ఎంపీఓ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post