ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, ప్రజలతో సన్నిహితంగా మమేకమై ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా రెవెన్యూ దిశగా రెవెన్యూ యంత్రాంగం పని చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ తో కలిసి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ధరణి, ఇతర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేనటువంటి ధరణి పోర్టల్ ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి భూములకు సంబంధించిన సమస్యలను ప్రజలకు అందుబాటులో ఉండే తహసీల్దార్ కార్యాలయాల్లో పరిష్కరించడం జరుగుచున్నదని అన్నారు. జిల్లాలో భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల భూముల సమస్యల మాడ్యూల్స్ లను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించడం జరుగుచున్నదని తెలిపారు. రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ ఒకే సారి ఒకే కార్యాలయంలో నిర్వహించడం జరుగుచున్నదని అన్నారు. ప్రజలకు సంబంధించిన అర్జీలను రెవెన్యూ అధికారులు స్వీకరించి నిర్దిష్టమైన ఎండార్స్మెంట్ తో, సవివరమైన సమాచారంతో వ్రాత పూర్వక సమాధానాన్ని అర్జీదారునికి అందజేయాలని అన్నారు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి అర్జీలు రాకుండా అక్కడికక్కడే సమస్య పరిష్కారం అయ్యే విధంగా తహసీల్దార్లు చొరవ చూపాలని అన్నారు. ఆర్డీఓ లు ఎప్పటికపుడు వారి పరిధిలోని కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ధరణి, ఇతర అంశాలకు సంబంధించిన వాటిని పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ మాడ్యూల్స్ క్రింద 414 పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వారంలోగా పరిష్కరించే విధంగా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, కదం సురేష్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, తహసీల్దార్లు, వివిధ విభాగాల సూపరింటెడెన్ట్, తదితరులు పాల్గొన్నారు.