ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు కోసం అవసరమైన సదుపాయాలు సమకూరుస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం రోజున ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు కోసం గ్రంథాలయం, వ్యాయామశాల, తదితర సదుపాయాలు సమకూరుస్తున్నదని అన్నారు. విద్యార్థులు విధిగా చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. వంద శాతం పాఠశాలకు హాజరు కావాలని అన్నారు. క్రీడల వలన విద్యార్థులలో సామర్థ్యం తెలుస్తుందని, టీమ్ లీడర్ స్కిల్స్ తెలియడం జరుగుతుందని అన్నారు. క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, క్రీడలతోనే ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పరుగు, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్యారం పోటీలను బహుమతులను అదనపు కలెక్టర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి సునీతకుమారి, జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, సహాయ సంక్షేమ అధికారులు, పిఇటిలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.