మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలనీ, మోడల్ స్కూల్ పనులను ఈ వారాంతం లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో చేపడుతున్న మన ఊరు- మన బడి పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తిచేయాలని, చేపట్టిన పనుల రికార్డు లను ఆన్లైన్లో నమోదు చేయాలనీ అన్నారు. ఇప్పటివరకు 37 మోడల్ స్కూల్ లకు గాను 25 పాఠశాలల పనులు పూర్తిచేయడం జరిగిందని, మిగితా పనులు ఈ వారాంతం లోగా పూర్తిచేయాలన్నారు. మోడల్ స్కూల్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలనీ ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు సంబందించిన పనులపై ప్రత్యేక చర్యలు చేపడుతూ రానున్న పది రోజుల్లో పూర్తిచేయాలని అన్నారు. అవసరమైన సిమెంట్ ను సమకూర్చుకోవాలని, పాఠశాలల పెయింట్ కు సంబందించిన వివరాలను రికార్డు చేయాలనీ అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, EGS పనులకు రేవైజుడ్ ఎస్టిమేట్స్ సమర్పించాలని సూచించారు. మన ఊరు- మన బడి క్రింద చేపడుతున్న టెండర్ పనులు, ఇతర పనులకు సంబందించిన రికార్డు లను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పనులను పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు డిఆర్డిఓ రవీందర్ రాథోడ్, సెక్టోరల్ అధికారులు నారాయణ, మున్సిపల్, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, సాంఘీక సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.