Press Note Dt.26-8-2021.
ఎందరో త్యాగధనుల కృషి వల్లనే మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామని, దీనికి ఆనాటి స్వాతంత్ర్య కాంక్షే ప్రతీక అని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు అన్నారు.
గురువారం నాడు జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్ ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో, నిజామాబాదు యూనిట్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎక్సిబిషన్ ను ఆయన ప్రారంభించి ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య 75 వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహా ఉత్సవ్ కార్యక్రమలో భాగంగా ఈ ఫోటో ఎక్సిబిషన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఇది 75 సంవత్సరాల పండుగ అని, దీనిని గత మార్చి 12 నుంచి ప్రారంభించడం జరిగిందని, 75 వారాలు అంటే వచ్చే ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా గత 75 ఏళ్లలో మన దేశం సాధించిన విజయాలు, అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుల క్రృషిని ప్రస్తుత తరానికి తెలియజేస్తాయని అన్నారు. ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ వలన వాళ్లు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా రగిలించి, పోరాటం చేసిన వారిని స్మరించుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా దేశ భక్తి, జాతీయత విద్యార్థులలో, యువతలో నింపే బాధ్యత మనపైన ఉందని, మహనీయుల త్యాగాలు, ఆశయాలను, వారు పోరాడిన స్వేచ్ఛ, స్వాతంత్ర్య స్పూర్తిని మనము భవిష్యత్ తరాలకు పరిచయం చేద్దామని అన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు, నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీనివాసరావు భారత అమృత్ మహోత్సవాల కార్యక్రమాన్ని, దాని ఉద్దేశాన్ని వివరించారు.
ఫోటో ఎగ్జిబిషన్ లో కొమరం భీము, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ , అల్లూరి సీతారామ రాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, రావి నారాయణరెడ్డి, కాళోజీ, దుర్గాబాయి దేశ్ముఖ్, సుద్దాల హనుమంతు, ముఖ్దుం మొయినుద్దీన్, స్వామి రామానంద తీర్థ, పీవీ నరసింహారావు, తుర్రేబాజ్ ఖాన్, నారాయణ రావు పవార్, సరోజినీ నాయుడు తదితరుల ఫోటోలను, వారి ముఖ్య విశేషాలను ప్రదర్శనలో ఉంచారు.
ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ క్రృష్ణమూర్తి, డిపో మేనేజర్ ఆనంద్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి. వేంకటేశ్వర రావు పాల్గొన్నారు.
అంతకు ముందు రెడ్డి రాజయ్య కళా బృందం నిర్వహించిన దేశభక్తి పాటలు ఆకట్టుకున్నాయి.
………DPRO. KMR.