Press note. 24.8.2021.
…….అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి, కోవిద్ ఏర్పాట్లతో ఆగస్టు 30 లోగా సిద్ధం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆదేశాలు.
……ప్రతి పాఠశాల గది, కారిడార్ శుభ్రంగా, ఫర్నిచర్ శుభ్రంగా ఉంచాలి. నీరు నిల్వ ఉండకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు.
సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యాసంస్థల పునఃప్రారంభం ఏర్పాట్ల కోసం మంగళవారం నాడు జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్లు, విద్య, వైద్య, పంచాయతీ, మున్సిపల్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల అధికారులు , ఎంపిడివో లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా కారణంగా విద్యాసంస్థలు మూత పడ్డాయని, దీనితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, విద్యాసంస్థలను తిరిగి తెరిస్తే మంచిదని తల్లిదండ్రులు భావిస్తున్నారని అన్నారు. గౌరవ సీఎం గారు అన్ని రాష్ట్రాలలో పరిస్థితులను పరిశీలించి వచ్చే సెప్టెంబర్ 1 నుండి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించినందున ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యా సంస్థలను రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. నూతన పంచాయతీరాజ్, మున్సిపాలిటీల చట్టం ప్రకారము గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండే దానిలో విద్యాసంస్థల పరిశుభ్రత కూడా ఒక భాగమని, ఈ బాధ్యత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలదేనని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ మేయర్, ఛైర్మన్లు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. స్కూల్స్ లో కిచెన్ షెడ్స్ , టాయిలెట్స్ గత 16 నెలల నుండి నిరుపయోగంగా ఉన్నందున వాటిని బాగు చేయించాలని, ట్యాంకులను శుభ్రం చేయించాలని, మిషన్ భగీరథ అధికారులు ప్రతీ స్కూలుకు మంచినీటి వ్యవస్థ ఏర్పరచాలని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతి స్కూల్లో నల్లాల పనితీరును మెరుగుపరిచాలని అన్నారు. జిల్లా యంత్రాంగం అన్ని స్కూళ్లను సిద్ధం చేయడానికి క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో పరిశుభ్రతతో, కోవిద్ నిబంధనలతో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ధ్రువీకరణ పత్రం అందజేయాలని తెలిపారు. జిల్లా పరిషత్ సి ఈ ఓ, ఎంపీడీవోలు ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో అన్ని విషయాలు పరిశీలించుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయితీ సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు ప్రతిరోజు తమ గ్రామంలోని పాఠశాలను సందర్శించాలని సూచించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నందున కోవిద్ నిబంధనలు పాటించాలని, విద్యార్థులు అందరూ మాస్కులు ఖచ్చితంగా ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో, పూర్వపు విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేసుకొని పాఠశాల అభివృద్ధి కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలనికోరారు. అధికారులు ప్రైవేటు విద్యాసంస్థలను పకడ్బందీగా తనిఖీ చేసి కోవిద్ నిబంధనలు పాటించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. మన రాష్ట్రం కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పరీక్షలు, కిట్స్ పంపిణీ పకడ్బందీగా నిర్వహించి కరోనా నియంత్రణకు కృషి చేశామని అన్నారు. పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు బాధ్యతగా ఉండాలని సూచించారు. సహచర మంత్రులు కూడా జిల్లాలో తిరిగి పాఠశాలలను సందర్శిస్తారని, ఏర్పాట్లు పరిశీలిస్తారని అన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం ఉపాధి హామీ నిధులను వాడుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో విద్యార్థులను పరిశీలిస్తుండాలని అన్నారు. పాఠశాలను అశ్రద్ధ చేస్తే దాని ప్రభావం భవిష్యత్తుపై ఉంటుందని, కాబట్టి శ్రద్ధగా పనిచేయాలని, విధులను అలక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని అన్నారు. పాఠశాలల పర్యవేక్షణకు క్లస్టర్ల ఏర్పాటుతో అధికారులను భాగస్వామ్యం చేసి, అందరి సమన్వయంతో పాఠశాల పునః ప్రవేశాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గత 16 నెలల నుండి కోవిడ్ కారణంగా ప్రపంచం అతలాకుతలం అయిందని, దీనితో విద్యారంగం దెబ్బతిందని, గౌరవ సీఎం గారు దీనిని దృష్టిలో ఉంచుకొని నిన్న సోమవారం నాడు ప్రజా ప్రతినిధులు, అధికారులతో రెండు గంటలు సమీక్షించి, అన్ని పరిస్థితులను బేరీజు వేసుకొని సెప్టెంబర్ 1 నుండి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు స్థానిక ఎంపీపీలు, సర్పంచులు కల్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు అందరినీ సమన్వయ పరుచుకుని పాఠశాలల పునఃప్రారంభానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో సమీక్షించుకుంటూ, ఈనెల 30వ తేదీలోగా అన్ని విద్యా సంస్థలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి తరగతి గదిని శానిటైజేషన్ చేయాలని, కారిడార్లను శుభ్ర పరచాలని, పరిసరాలు శుభ్రంగా ఉండేలా, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు కూడా పల్లెల్లో భాగం కాబట్టి సర్పంచులు పాఠశాల అభివృద్ధికి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. మిషన్ భగీరథ త్రాగునీరు అన్ని పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, మధ్యాహ్న భోజనం పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతిరోజూ ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు నివేదికలు పంపాలని తెలిపారు. అధికారులు ప్రైవేటు విద్యాసంస్థలను తనిఖీ చేయాలని, ప్రైవేట్ స్కూల్స్ లో బస్ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థను కోవిద్ నిబంధనల ప్రకారం పర్యవేక్షించాలని తెలిపారు. విద్యార్థులకు ఎక్కడైనా కోవిద్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సహాయం అందించాలని, ఇతర విద్యార్థులను, ఉపాధ్యాయులను పరీక్షించాలని తెలిపారు. అవసరమైన చోట పాఠశాలల్లో దాతల సహాయంతో వైట్ వాష్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ సి ఓ లు, ఎంపీడీవోలు అన్ని పాఠశాలలను తనిఖీ చేయాలని, డి పి వో లు, ఎంపీడీవోల తో కోఆర్డినేట్ చేసుకోవాలని అన్నారు. పాఠశాల కోసం అవసరమున్న చోట ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలని తెలిపారు. బ్లీచింగ్, హైపో క్లోరైడ్ పిచికారి చేపట్టాలని తెలిపారు. ఈనెల 30 వ తేదీ మధ్యాహ్నం లోగా అన్ని పాఠశాలలు అన్ని వసతులతో సిద్ధంగా ఉన్నాయని సంబంధిత ఎంపీడీవోలు ధ్రువీకరణ పత్రాలు అందచేయాలని ఆదేశించారు. భోజనం తయారు చేసే కిచెన్ షెడ్స్ వాతావరణం పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ పాఠశాలల్లో టాయిలెట్స్ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వివరిస్తూ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలను బాగు చేసుకున్న విధంగానే ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ప్రస్తుతం 50 శాతం హాజరు ఉన్న ఉపాధ్యాయులను రేపటినుండి 100 శాతం పాఠశాలలకు హాజరయ్యేలా, పాఠశాలల వసతులకు చర్యలు తీసుకునేలా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి పాఠశాలకు విద్యుత్, మంచినీరు, మిడ్ డే మీల్స్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. కోవిద్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ, పాఠశాలలో గాలి, వెలుతురు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అన్ని విద్యాసంస్థలు పరిశీలిస్తామని తెలిపారు. పూర్తిస్థాయి వసతులతో పాఠశాలలు సిద్ధం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లా పరిషత్ సీఈవో సాయ గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, ట్రాన్స్కో ఎస్.ఇ. శేషారావు, ఎస్సీ సంక్షేమ అధికారి రజిత, ఎస్టీ సంక్షేమ అధికారి అంబాజీ, బిసి సంక్షేమ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
….DPRO. KMR