అగ్నిమాపక శాఖ రసాయన పిచికారీ కార్యక్రమం లో పాల్గొన్న హోం మంత్రి

ఆదివారం నాడు చార్మినార్ వద్ద అగ్నిమాపక శాఖ ద్వారా చేపట్టిన రసాయన (సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం) పిచికారీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గ యం.ఎల్.ఏ. ముంతాజ్ అహ్మద్ ఖాన్, కమీషనర్ అఫ్ పోలీస్, హైదరాబాద్ అంజని కుమార్, ఐ.పి.ఎస్., తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ జనరల్, సంజయ్ జైన్, ఐ.పి.ఎస్., ప్రాంతీయ అగ్నిమాపక అధికారి పాపయ్య మరియు అగ్నిమాపక శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా, అగ్నిమాపక శాఖ తెలంగాణా రాష్ట్రం అంతటా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తోంది. కార్యక్రమం సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ …. కరోనా వైరస్ కు ఇప్పటివరకు వాక్సిన్ కాని, మందు కాని లేదని, ఈ వైరస్ వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఇతర శాఖలు ఈ కరోన వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా అహర్నిశలు కృషి చేస్తున్నాయని, ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను గౌరవించి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హోం మంత్రి కోరారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరిస్తున్నారని, కాని కొందరు లాక్ డౌన్ సమయంలో అవసరం లేకున్నా బయట కు రావడం చేస్తున్నారని, ఇది ప్రమాదకారి అని తెలిపారు. రంజాన్ మాసం మొదలు లాక్ డౌన్ కాలంలో మొదలు అవుతున్న కారణంగా, ముస్లింలు ఇళ్లలోనే నమాజ్ చదవాలని, ఇఫ్తార్ కుడా కుటుంబ సభ్యులతోనే పాటించాలని, హోం మంత్రి విజ్ఞప్తి చేసారు. లాక్ డౌన్ ప్రకటించిన మొదటి రోజే, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు, పేదలకు కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 12 కేజీల బియ్యం, ఇతర సామగ్రి ఉచితంగా ప్రకటించి … అమలు చేస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి 1500 రూపాయల నగదు కుడా ఇస్తున్నాం అని తెలిపారు. త్వరలోనే, కరోనా పై విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమీషనర్ అఫ్ పోలీస్ అంజని కుమార్, ప్రజలు లాక్ డౌన్ కు పూర్తిగా సహకరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్పుడే కరోన వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని విజ్ఞప్తి చేసారు.

Share This Post