Hon’ble CM

పత్రికా ప్రకటన                                                                                                                    తేది.24.05.2021

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని, దాన్ని కొనసాగిస్తూనే, ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షలకోసం వస్తున్న ప్రతి వొక్కరికీ  నిరాకరించకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా పరీక్షలకు సంబంధించి రాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలన్నారు. రేపటినుంచే అన్ని వైద్యకేంద్రాల్లో ఇప్పుడు ఇస్తున్న కిట్ల సంఖ్యను పెంచాలని, అవసరమున్న మేరకు ఉత్పత్తిదారులతో మాట్లాడి సరఫరాను పెంచాలని సూచించారు.  బ్లాక్ ఫంగస్  వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్సకోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు,  మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సిఎం సూచించారు. కరోనా కట్టడి,బ్లాక్ ఫంగస్  వాక్సిన్, లాక్ డౌన్  అమలు పై సోమవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన  ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో  మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం సెక్రటరీ సిఎంవో కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి,  సిఎం కార్యదర్శి భూపాల్  రెడ్డి, డిజిపి  మహేందర్ రెడ్డి,    కమిషనర్లు అంజనికుమార్, సజ్జనార్, మహేష్  భగవత్, అడీషినల్ డిజి జితెందర్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వి,  హెల్త్ డైరక్టర్  శ్రీనివాసరావు, సిఎం వోఎస్డీ గంగాధర్, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, , డిఎంఈ రమేష్  రెడ్డి, కాళోజీ హెల్త్  యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి,  కరోనా టాస్కఫోర్స్ మెంబర్లు జయేష్ రంజన్, వికాస్ రాజ్,  ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు,  రొనాల్డ్ రాస్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, వారి ఆరోగ్య రక్షణలో భాగంగా లాక్ డౌన్ కఠినంగానే అమలువుతున్నది.  ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించడం కోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంది.  సత్ఫలితాలనిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను నిర్వహిస్తూ వ్యాధి లక్షణాలున్నవారికి మందుల కిట్లను అందించే కార్యక్రమాన్ని కొనసాగించాలి.  అదే సమయంలో  కరోనా అనుమానితులకు పరీక్షలను నిరాకరించకూడదు. ఇంతవరకే పరీక్షలు నిర్వహిస్తామనే నిబంధనలు ఉండకూడదు. ప్రాథమిక వైద్య కేంద్రాల వద్దకు వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల కోసం వచ్చే వారిలో అధికశాతం అత్యంత నిరుపేదలుంటారు కాబట్టీ ఏ ఒక్కరికి కూడా పరీక్ష నిరాకరించకూడదు. ఇట్లా మందుల కిట్లను అందిస్తూ పరీక్షల సంఖ్య పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలి ” అని సిఎం స్పష్టం  చేశారు.

కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తక్షణమే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సిఎం ఆదేశించారు. ఉత్పత్తిదారులతో మాట్లాడి, పీహెచ్ సీలకు, అన్ని పరీక్షా కేంద్రాలకు కిట్ల సరఫరాను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.  అదే సమయంలో వైద్య కేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు, వైద్యాధికారులకు ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సిఎం సృష్టం చేశారు.

తక్షణమే రాష్ట్రంలోని డిఎంహెచ్ఓలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించి నియమాకాల  ప్రక్రియ గురించి, దవఖానాల్లో  మందులు తదితర మౌలిక వసతుల అవసరాల గురించి అడిగి తెలుసుకోవాలని, నివేదిక తయారు చేసి తెప్పించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును సిఎం  ఆదేశించారు.  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దని సిఎం మరోసారి స్పష్టం చేశారు.

లాక్ డౌన్  నేపధ్యంలో కొన్ని శాఖల ఖర్చు పెరుగుతుందని, కొన్ని శాఖల ఖర్చు తగ్గుతుందని సిఎం అన్నారు. ఖర్చు తగ్గే అవకాశాలున్న శాఖలను గుర్తించి ఖర్చు పెరిగే అవకాశాలున్న పోలీస్, వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్ ను పెంచాలని, ఈ విషయం మీద సమీక్ష నిర్వహించాలని మంత్రి హరీష్ రావును సీఎం ఆదేశించారు. లాక్ డౌన్ తో కరోనాని సమర్థవంతంగా కట్టడి చేసిన ఢిల్లీలాంటి అర్బన్ కేంద్రాలలో చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. అవసరమైతే వైద్య బృందం వెల్లి పరిశీలించి రావాలన్నారు.

అన్ని పడకలను ఆక్సీజన్ పడకలుగా మార్చాలని రాష్ట్రంలో ఆక్సీజన్ ఉత్పత్తిని 600 ఎం టీలకు పెంచే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. అదే సందర్భంలో…సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వాల్లు అధికి సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాక్స్ ఫోర్సు చైర్మన్ మంత్రి కెటిఆర్ ను సిఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ వొకవేల వస్తే ఎదుర్కునేందుకు సిద్దంగా వుండాలని తెలిపారు.

“మనం ఇప్పటికే కరోనా శాతాన్ని తగ్గించడంలో సత్ఫలితాలను సాధిస్తున్నాం. అయితే ఇంకా కట్టడి శాతాన్ని పెంచేందుకు మనం కృషి చేయాల్సి వున్నది. మంచి కార్యక్రమాలను మనం ఎక్కడి నుంచైనా చూసి తెలుసు కోవచ్చు. అందులో తప్పేం లేదు. ఢిల్లీ ప్రభుత్వం సమర్థవంతంగా  కరోనాను కట్టడి చేస్తున్నదని తెలుస్తున్నది. మహారాష్ట్ర  కూడా కరోనాను కట్టడి చేయడంలో సత్ఫలితాలను సాధిస్తున్నది. ఇంకా ఏ ఏ రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నవి. అందుకు వారు అమలు పరుస్తున్న కార్యాచరణ  ఏంటో తెలుసుకోండి” అని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. ‘‘తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాని శాతం 5 శాతానికి తగ్గించగలిగినప్పుడే మనం కరోనా మీద విజయం సాధించినవారమౌతాం. ఆ దిశగా వైద్యాధికారులు చర్యలను చేపట్టాల’’ని సీఎం సూచించారు. అదే సందర్భంలో కరోనానంతర పరిణామాల మీద సీఎం చర్చించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధిని కట్టడి చేయడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి  సిఎం చర్చించారు.

 బ్లాక్ ఫంగస్ చికిత్సకోసం గాంధీలో 150 బెడ్లను ఈ.ఎన్.టి. ఆస్పత్రిలో 250 బెడ్లను, మొత్తం కలిపి 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు సీఎంకు వివరించారు.

బ్లాక్ ఫంగస్ విస్తరిస్తున్నదని,  హైదరాబాద్ లో బ్లాక్ ఫంగస్ వ్యాధి గ్రస్థులకు  చికిత్స అందించాలంటే, రద్దీని తట్టుకోవాలంటే  ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే వున్నవి కాకుండా ఇంకా ఏయే దవాఖానాల్లో బెడ్లను పెంచాలనే విషయాలను సీఎం చర్చించారు. సరోజినీ దేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకోసం తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు. హైద్రాబాద్ లో  బెడ్లు కనీసం 1100 వరకు, జిల్లాల్లో 400 వరకు మొత్తం 1500 బెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు, బ్లాక్ ఫంగస్ ను తగ్గించే మందులు ఎంత సంఖ్యలో అవసరమున్నదో అంచనా వేసి దానిమేరకు  బ్యాక్ ఫంగస్ చికిత్సకు మందులను తక్షణమే ఆర్డరివ్వాలని సిఎం తెలిపారు. అందుబాటులో వున్న ‘‘పోసకోనజోల్’’ మందు స్టాక్  తక్షణమే పెంచాలని, అందుకు తగు చర్యలు చేపట్టాలని సిఎం సూచించారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలని సిఎం అన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ‘‘రాష్ట్రానికి పక్క రాష్ట్రాల నుంచి అటు కరోనా ఇటు బ్లాక్ ఫంగస్  చికిత్స కోసం తరలి వస్తున్నారు.  రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు వాస్తవమే. అయితే.. కరోనా చికిత్స విషయంలో నాలుగు కోట్లుగా కాకుండా అది పది కోట్లుగా అంచనా వేసుకోవాలె. మనకు  ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వాల్లకు కూడా చికిత్సను అందజేయంది తప్పేటట్టు లేదు..’’ అని సిఎం అన్నారు.  కరోనా కంట్రోల్ చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, ఎన్ని కోట్లయినా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా వుందని, అవసరమైతే అప్పు తెచ్చయినా కరోనా కట్టడికి సిద్దంగా వుంది’’.. అని అధికారులకు సిఎం స్పష్టం చేశారు.   ‘‘ అటు కరోనా ఇటు బ్లాక్ ఫంగస్ తో మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో వున్నది.   ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతో పాటు, ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృకృథంతో స్పందించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

Share This Post