పత్రికా ప్రకటన,
తేది. 06.06.2021.
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రముఖ కవి, కళాకారుడు, సుద్దాల హనుమంతు గారి జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ కు చెందిన మహనీయులు, కవులు, చరిత్రకారులు, సాహితీవేత్తల వారు అందించిన సేవలకు గుర్తుగా, వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియచెప్పాలనే లక్ష్యం తో వారి జయంతి, వర్ధంతి వేడుకల్ని ప్రభుత్వం తరుపున రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులను గౌరవిస్తూ, సన్మానిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
సుద్దాల హనుమంతు గారు పేద ప్రజల కోసం, జీవితమంతా కష్టజీవుల కోసం, ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి అని అన్నారు. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు అని పేర్కొన్నారు. వారి కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుందన్నారు. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత గా అభివర్ణించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారన్నారు. నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు అని వెల్లడించారు.
హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారన్నారు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్’, ‘బుడబుక్కలు’, ‘ఫకీరు వేషం’, ‘సాధువు’ మొదలైన కళా రూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఆ రోజుల్లో ఉపన్యాసాలకంటే పాటే జనంలోకి బాగా చొచ్చుకుపోయేదన్నారు. పాటే జనంలో చైతన్యాన్ని కలిగించేదన్నారు. వెట్టిచాకిరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశారు. ఇవన్నీ `వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
హనుమంతు పాటలను సుద్దాల హనుమంతు గారి కుమారుడు సుద్దాల అశోక్ తేజ గారు ఈ సందర్భంగా పాడి వినిపించారు.
పల్లెటూరి పిల్లగాడ ,
రణభేరి మ్రోగింది తెలుగోడ,
వేయ్ వేయ్ దెబ్బ,
ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కన్నులో
భళిరె తెలంగాణ వహరె తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయనకు పేరు తెచ్చాయన్నారు మంత్రి శ్రీ. V. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ కార్యక్రమంలో MLC శ్రీ. బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ KS శ్రీనివాస రాజు, ప్రముఖ కవి, రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.