ITDA UTNOOR: పోడు భూముల సర్వే గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

 

పోడు భూముల సర్వే గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించండి: ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

పోడు భూముల సర్వే పూర్తయిన గ్రామాలలో గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని ఐటీడీఏ పిఓ కె. వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని టిటిడిసి సమావేశ మందిరంలో పోడు భూముల సర్వే పై ఎంపీడీవోలు, అటవీ, పంచాయతీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా అటవి శాఖ అధికారి రాజశేఖర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ, పోడు భూముల సర్వే పై గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభలలో దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేస్తూ పూర్తి చేయాలని అన్నారు. గ్రామ సభలు నిర్వహించే ముందు గ్రామాలలో టామ్ టామ్ వేయించాలని, సభకు హాజరైన వారి హాజరు తప్పక తీసుకోవాలని సూచించారు. చట్ట ప్రకారం ఇదివరకే సాగులో ఉన్నవారికి మాత్రమే ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో కొత్తగా పోడు చేస్తే పట్టాలు ఇస్తారనే భావన ఉందని, ఇది పూర్తిగా తప్పని అన్నారు. కొత్తగా పోడు చేస్తే వారికి మంజూరైన పట్టాలను రద్దు చేస్తామని, రైతు బంధు పథకాన్ని నిలిపివేస్తామని వివరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీశాఖ అధికారులు, ఎంపిడిఓలు, పంచాయతీ కార్యదర్శిలు సమన్వయంతో పని చేయాలనీ సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ, పోడు భూముల సర్వే గ్రామసభలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో అధిక శాతం అటవీ ప్రాంతం ఉన్నందున అడవులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుందని అన్నారు. కొత్తగా పోడు చేస్తే వెంటనే సమాచారం అందించే బాధ్యత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆయా గ్రామాల సర్పంచుల పై ఉందని అన్నారు. మిగిలి ఉన్న సర్వే దరఖాస్తుల సర్వేను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, ఐటిడిఎ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, ఎంపిడిఓలు, అటవీశాఖ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

అదనపు పౌరసంబంధాల అధికారి (ఐటిడిఎ) ఉట్నూర్ చే జారీచేయనైనది.

Share This Post