KBASF : బదిలీపై వచ్చిన ఉద్యోగుల వివరాలు పూర్తి స్థాయిలో అందించాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా జిల్లాకు వచ్చిన ఉద్యోగుల వివరాలను జిల్లా, జోన్‌, మల్టీజోన్‌ల వారిగా పూర్తి స్థాయిలో అందించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు అన్ని శాఖలలో 1318 మంది ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వడం జరిగిందని, నూతనంగా ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ త్వరలో పూర్తి కానున్నందున దాదాపు 30 శాఖలకు సంబంధించిన గదులు సిద్దం చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు కేటాయించబడిన పోస్టుల వివరాలు, క్యాటగిరీ వారిగా పోస్టుల ఖాళీలు, స్పౌజ్‌ కేసుల వివరాలు, ప్రతి శాఖలో రెండు, మూడు రోజులలో ఖాళీల వివరాలతో పూర్తి స్థాయి నివేదిక అందించాలని తెలిపారు. జిల్లాలో ప్రసవ మరణాలు గతంలో కంటే చాలా వరకు తగ్గడంతో పాటు న్యూట్రిషన్‌ చాలా మెరుగుపడిందని, కార్యచరణ ప్రకారంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికబద్దంగా పని చేయాలని తెలిపారు. జిల్లా అధికారి జిల్లా కలెక్టర్‌ అనుమతి లేకుండా హెడ్‌క్వాటర్‌ బదిలీ వెళ్ళరాదని, ఏదైనా అత్యవసరమైతే అనుమతి తీసుకొని వెళ్ళాలని, ఎవరైనా అధికారులు చెప్పకుండా వెళ్ళినట్లయితే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఫైల్‌ ఈ-ఆఫీస్‌ ద్వారా పంపించాలని, కోర్టు సంబంధిత కేసులలో కలెక్టరేట్‌ ద్వారా పంపించవలసి ఉంటుందని, ఏదైనా కేసులలో కౌంటర్స్‌ సమర్పించడంపై సమాచారం అందించి ఆమోదం పొందాలని తెలిపారు. జిల్లాలో శుక్రవారం నుండి కొవిడ్‌-19పై ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో అన్ని మండలాలలో ప్రత్యేక అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post