MBNR – అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా జిల్లాలో వీలైనంత ఎక్కువ మంది ఎస్ సి విద్యార్థులు లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు.

మంగళవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విషయం పై నిర్వహించిన సెమినార్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎస్ సి విద్యార్థుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నదని, ఈ పథకం కింద విదేశాలలో లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలలో పిజీ, మరియు ఆపై ఉన్నత స్థాయి విద్య అభ్యసించేందుకు ఎంపికైన వారికి 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అంధిస్తుందని తెలిపారు .తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలకు మించకుండా, 35 సంవత్సరాల లోపు ఉన్న వారు ఈ పథకం కింద అర్హులని, కుటుంబం నుండి ఒకరికి మాత్రమే ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని,డిగ్రీ పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని, అంతేకాక గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఆడ్మిషన్ పొంది ఉండాలని తెలిపారు.
ఆసక్తి ఉన్న ఎస్ సి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎస్సీ విద్యార్థుల మాదిరిగానే బీసీ ,ఎస్టీ విద్యార్థులకు కూడా జ్యోతిబాపూలే పథకాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పథకం కింద విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏలాంటి పరిమితి లేదని, వీలైనన్ని ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలిపారు. మెడికల్ కళాశాల తో పాటు త్వరలోనే పాలమూరు యూనివర్సిటీ లో కూడా ఇలాంటి సెమినార్ ను నిర్వహించనున్నామని, వీలైనంత ఎక్కువమంది ఎస్ సి విద్యార్థులు జిల్లా నుండి అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాలలో వెళ్లి విద్యనభ్యసించాలని కోరారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఆసక్తి ఉన్న విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి వాటిని పంపించే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డి డి యాదయ్య, డెంటల్ కళాశాల డాక్టర్ దినేష్ ,ఎస్ వి ఎస్ కళాశాల డాక్టర్ అశ్విని కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share This Post