ఆజాది క అమృత్ మహోత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరికి చట్టాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు, ఉచిత న్యాయ సహాయం విషయమై అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు పాన్ ఇండియా అవేర్నెస్ & అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణా రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి మరియు జిల్లా సెషన్స్ జడ్జ్ రేణుక యార తెలిపారు.
శుక్రవారం ఆమె మహబూబ్ నగర్ లోని కలెక్టర్ కార్యాలయం నుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ,మండల స్థాయి అధికారులు, పోలీసులు,మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు,స్థానిక సంస్థల అధికారులు,ఇతర సంబంధిత అధికారులతో చట్టాలపై న్యాయ అవగాహనకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చట్టం ప్రకారం 90 శాతం జనాభా ఉచితంగా న్యాయ సహాయం పొందేందుకు అర్హులేనని కానీ ఇప్పటికీ కేవలం 30 శాతం మంది ప్రజలు మాత్రమే ఉచిత న్యాయ సహాయాన్ని పొందుతున్నారని, అవగాహన లేమీ కారణంగానే తక్కిన వారు ఈ హక్కును పొందలేకపోతున్నారని తెలిపారు.
స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాది క అమృత మహోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని ఇందులో దేశం లోని అన్ని శాఖలు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వస్తున్నారని, ఇందులో భాగంగానే న్యాయ శాఖ ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, ఉచిత న్యాయ సహాయం పై గ్రామ గ్రామాన అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుంచి ప్రారంభించడం జరిగిందని, భారతదేశంలోని సుమారు 6 లక్షల 70 వేల గ్రామాలకు లీగల్ వాలంటీర్లు, న్యాయ విద్యార్థులు వెళ్లి చట్టాల పట్ల, ఉచిత న్యాయ సహాయం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తారని ఆమె తెలిపారు. చదువు లేకపోవడం వల్ల, ఆర్థికంగా వెనుకబడి పోవడం వల్ల ,సామర్థ్యం లేని కారణంగా ఒక వ్యక్తి న్యాయవాదిని నియమించుచకోలేక పోవటం కారణంగా శిక్ష పడకూడదని ఇందుకుగాను ఉచిత న్యాయ సహాయం అందించి చట్టాలపై అవగాహన కలిగించేందుకు 1987లో న్యాయ సేవల చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, 1995 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇందుకుగాను జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో న్యాయసేవాధికార సంస్థ లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు .ఉచిత న్యాయ సహాయం పొందేందుకు ప్రతి మహిళ, పిల్లలు, వృద్ధులు అందరూ అర్హులేనని, 90 శాతం జనాభా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులే నని అన్నారు.
పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉచిత న్యాయం తో పాటు, చట్టాలపై అవగాహన , ఆయా సందర్భాలలో బాధితులకు నష్టపరిహారం చెల్లింపు పై కూడా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణిస్తే 10 లక్షల రూపాయలు బాధితులకు చెల్లించేందుకు చట్టం లో ఉందని, అదేవిధంగా హత్యకు గురైన వ్యక్తి కుటుంబ బాధితులు 7 లక్షల రూపాయలు, రేప్ కేసులో బాధితులకు 7 లక్షల రూపాయలు,శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి 5 లక్షల రూపాయలు, గాయాలపాలైన వారికి లక్ష రూపాయలు, పోక్సో చట్టం కింద గరిష్టంగా 7 లక్షల వరకు బాధితులు నష్టపరిహారం పొందవచ్చని ,వీటన్నిటిని ప్రజలు ఉపయోగించుకునేలా అధికారులందరు అవగాహన కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు చట్టాల పట్ల న్యాయ అవగాహన, ఉచిత న్యాయ సేవ సహాయం అందించడం, బాధితులకు నష్టపరిహారం చెల్లింపు వంటి అంశాలలో జిల్లా అధికారులు న్యాయ సేవాధికార సంస్థ సూచించిన నిబంధనలను పాటించాలని కోరారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి ,రెవిన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామ రావులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.