@ఆర్ఎంపీలు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తే క్రిమినల్ కేసులు– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
@ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులు సాధారణ కాన్పు లే చేయండి -జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ,ప్రైవేటు ఆసుపత్రులలో గైనకాలజిస్ట్ లు సిజేరియన్ ఆపరేషన్ లు చేయకుండా సాధారణ కాన్పులు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కోరారు.
జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించటం పై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల గైనకలాజిస్ట్ ల తో శుక్రవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు.
ఇటీవలికాలంలో గర్భిణీ స్త్రీలు, తల్లిదండ్రులు,అత్తా మామలు ముహూర్తం చూసుకుని మరి సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా కాన్పులు చేయించుకుంటున్నారని ,ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించే విషయం పై మహిళ గర్భం దాల్చిన వెంటనే డాక్టర్లు వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అవసరమైతే ఈ విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన సూచించారు. గర్భిణీ స్త్రీలు చిన్న చిన్న పనులు చేసేలా వారికి అవగాహన కల్పించాలని, అప్పుడే వారికి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని అన్నారు. సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కలిగే నష్టాలు,సాధారణ కాన్పుల లాభాల పై డాక్టర్లతో పాటు, కింది స్థాయిలో పనిచేసే నర్సులు,సిబ్బందికి ఈ నెల 15లోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, 20వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలంలో వారం రోజుల పాటు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ప్రతి గ్రామంలో గర్భిణీ స్త్రీల వివరాలను సేకరించి వారికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు .సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కలిగే ఇబ్బందులు, బిడ్డ పుట్టిన తర్వాత ఏర్పడే ఇబ్బందులు, మూఢనమ్మకాలు, సాధారణ కాన్పు వల్ల కలిగే లాభాలు, మహిళలకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించాలని, ఇందుకుగాను బొమ్మలతో సహా సులభంగా అర్థమయ్యేలా ఒక మంచి మాడ్యూల్ రూపొందించాలని ఆయన సూచించారు .
ఎవరైనా ఆర్ఎంపీలు వారి క్లినిక్ లలో సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.గైనకాలజిస్ట్ లు సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహించవద్దని అన్నారు .అన్ని ప్రభుత్వాసుపత్రుల తోపాటు ,ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ల పై ప్రతి వారం నివేదిక సమర్పించాలని అన్నారు .సిజేరియన్ ఆపరేషన్లు నిరోధించడంలో భాగంగా జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ బృందం ఆకస్మికంగా ఆస్పత్రులను తనిఖీ చేసి సిజేరియన్ ఆపరేషన్లు చేసేందుకు ఏర్పడిన పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేయవలసి వస్తే ఆపరేషన్ ఎందుకు చేశారో పూర్తి వివరాలతో సంబంధిత గైనకాలజిస్టులు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సిజరిన్ ఆపరేషన్ల వల్ల కలిగే ఇబ్బందులపై వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియ చేయడమే కాకుండా, తల్లిదండ్రులకు, అత్తమామలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డాక్టర్లతో మాట్లాడుతూ సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలను, సూచనలను స్వీకరించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రమేష్,ఐ ఎం ఏ అధ్యక్షులు డాక్టర్ రామ్ మోహన్, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులు ఈ సమావేశానికి హాజరయ్యారు .