MBNR – ఇంటర్ ,పదవ తరగతి పరీక్ష కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితులలో సెల్ ఫోన్లు అనుమతించబడవు.

@ఇంటర్, పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో కి ఎట్టి పరిస్థితులలో సెల్ ఫోన్లు అనుమతించబడవు
@ ఎవరైనా విద్యార్థులు సెల్ ఫోన్లతో వస్తే వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడమే కాకుండా, తిరిగి వాపసు ఇవ్వబడవు
@ సెల్ ఫోన్ తో వచ్చిన వారిని పరీక్షలకు అనుమతించడం జరగదు- జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు వెల్లడి

మే 6 నుండి 19 వరకు ,మే 23 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ,పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాలలో కి విద్యార్థులను సెల్ఫోన్ల తో అనుమతించడం జరగదని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు స్పష్టం చేశారు.
ఇంటర్మీడియట్ ,పదవతరగతి పరీక్షలపై గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్ పి లు, ఇంటర్ ,పాఠశాల విద్య,ఇతర సంబంధిత శాఖల అధికారులుతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రా లలోకి ఎట్టి పరిస్థితిలో సెల్ఫోన్లు అనుమతించడం జరగదని ,ఒకవేళ ఎవరైనా సెప్ల్ ఫోన్ తో వస్తే స్వాధీనం చేసుకోవడమే కాక, వాటిని వెనక్కి ఇవ్వడం జరిగిందని, అందువల్ల విద్యార్థులు ఎవరు సెల్ఫోన్లతో పరీక్ష కేంద్రాల వద్దకు రావద్దని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు పరీక్ష కేంద్రాలలోకి కూడా అనుమతించడం జరగదని స్పష్టం చేశారు .
జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని,పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ విద్యాశాఖ మంత్రికి కార్యదర్శికి వివరించారు.
ఇంటర్, పదవ తరగతి పరీక్షల పై ఈనెల 25 న సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షల సందర్భంగా ఏలాంటి కాపీ జరగకుండా విద్యార్థులను తనిఖీ చేయటం, తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన తాగునీరు,ఓ ఆర్ ఎస్ పాకెట్లు,నీడ ఇతర అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు .
జిల్లా నుండి 21674 మంది విద్యార్థులు ఇంటర్, 13242 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారని, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు 32 కేంద్రాలు, పదవతరగతి పరీక్షలు రాసేందుకు 59 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖల ద్వారా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లతో పాటు,ఓ ఆర్ ఎస్ పాకెట్లు సిద్ధం చేస్తున్నామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన ఫర్నిచర్ను, తగినన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించామని, పరీక్షలు నిర్వహించే రోజుల్లో 144 సెక్షన్ తోపాటు ,జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా ఇదివరకే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు .
జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలను భద్రం గా ఉంచడంతో పాటు ,అవసరమైన పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ విధింపు, సీసీ కెమెరాల ఏర్పాటు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతకు ముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గడచిన రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఇంటర్ ,పదవ తరగతి పరీక్షలను నిర్వహించలేక పోయామని, అయితే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో పరీక్షలను నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, నీడ, ఓ ఆర్ ఎస్ కిట్లు , ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని ఆమె చెప్పారు. ఆర్టీసీ అధికారులు పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని, జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని, 144వ సెక్షన్ విధించాలని, భయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థుల కోసం ప్రత్యేకించి కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు చేశామని అవసరమైన వారు రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ 18005999333 కి ఫోన్ చేయవచ్చని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 14 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి,ఇంటర్ పరీక్షలను రాస్తున్నారని ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ దేవసేన రాష్ట్ర స్థాయి నుండి హాజరుకాగా, ఇంటర్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ,డి ఈ ఓ ఉషారాణి , ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

Share This Post