MBNR – ఇప్పటివరకు జిల్లాలో 30368 మె. టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు.

@ఇప్పటివరకు జిల్లాలో 30368
మె. టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు
@రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు అన్ని కొనుగోలు కేంద్రాలలో ఎక్స్ ట్రా టార్పాలిన్ల ఏర్పాటు
@ గన్ని బ్యాగులకు ఎలాంటి కొరత లేదు
@కొనుగోలు చేసిన ధాన్యంలో ఇప్పటివరకు 29904 మె. టన్నుల ధాన్యం మిల్లులకు తరలింపు-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
@నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి- ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందండి-రైతులకు పిలుపు
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన 1960/- రూపాయల మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులు అవగాహన లోపం వల్ల చిన్న చిన్న తప్పిదాల కారణంగా తక్కువ రేటుకు దాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి వస్తున్నదని, అలా కాకుండా ధాన్యాన్ని శుభ్రపరచి, ఆరబెట్టి, ఏలాంటి మట్టి పెల్లలు,తాలు,తేమ వంటివి లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన 1960/- రూపాయల మద్దతు ధరను సులభంగా పొందవచ్చని అన్నారు. రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత రైతుల పై ఉందని కలెక్టర్ అన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం వర్షానికి ఒక్క గింజ కూడా తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయని,రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి కొనుగోలు కేంద్రంలో ఎక్స్ ట్రా టార్పాలిన్లు కొనుగోలు చేసి ఉంచినట్లు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో వర్షానికి ధాన్యం తడవడానికి వీలు లేదని కలెక్టర్ చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హన్వాడ మండలం బుద్ధారం నుండి ధాన్యం తీసుకువచ్చిన రైతు వెంకటయ్య తో ముఖాముఖి మాట్లాడారు. ఎన్ని బస్తాల ధాన్యం మార్కెట్ కు తీసుకు వచ్చారని? ఎంత ధర వచ్చిందని ? అడిగి తెలుసుకున్నారు.
కాగా తాను 15 బస్తాలు ధాన్యాన్ని తీసుకు వచ్చానని, 1800 /-నుండి 2000/- వరకు క్వింటాలు ధర కొనుగోలు చేస్తున్నారని వెంకటయ్య కలెక్టర్ కు తెలిపారు.
యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాల ద్వారా 30368 మె. టన్నుల ధాన్యంకొనుగోలు చేయటం జరిగిందని,29904 మె. టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని కలెక్టర్ తెలిపారు.ధాన్యం కొనుగోలుకు ఎలాంటి గన్ని బ్యాగుల కొరత లేదని,అలాగే వర్షానికి ధాన్యం తడవకుండా అవసరమైనన్ని టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
కాగా వర్షానికి ధాన్యం తడవకుండా మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వాహకులు చేసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ వెంట మార్కెటింగ్ అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఉన్నారు.

 

Share This Post