MBNR – ఇసుక రీచుల నుండి ఇసుకను తీసే ముందు సంబంధిత గ్రామాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

ఇసుక రీచుల నుండి ఇసుకను తీసే ముందు సంబంధిత గ్రామాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
ఇందుకుగాను ఆయా గ్రామాలలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాలు నిర్వహించాలని అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వే ప్రాంతాలలో ఆ విషయాన్ని వారం రోజుల ముందే నోటీస్ ద్వారా గ్రామాల ప్రజలకు,స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసి గ్రామపంచాయతీ తీర్మానాలను తీసుకున్న తర్వాత ఇసుక తవ్వాలని చెప్పారు. గుర్తించిన ఇసుక రీచుల నుండి ఇసుక తీయటం పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి దాపరికం ఉండకూడదని చెప్పారు.
రెవెన్యూ,పోలీస్ అధికారులు జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని అన్నారు. ఇసుక రీచ్ లను పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూడాలని,అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ బృందాలను పటిష్టం చేయాలని, ఆయా శాఖల వారీగా ఇసుక డిమాండ్ ను ముందే సేకరించాలని, ఏ రీచ్ ద్వారా ఇసుక ఇవ్వాలో ముందే ప్రణాళిక రూపొందించాలని, నెలకు, మూడు నెలలకు ఎంత ఇసుక అవసరం ఉంటుందో ముందుగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్మశాన వాటిక లకు ఇసుక సమస్య రాకుండా చూసుకోవాలని చెప్పారు. ఆయా శాఖలు ప్రతినెల ఎంత ఇసుక కావాలో ముందే ఇండెంట్ ఇవ్వాలన్నారు. ఇసుకను తీసే ముందు తప్పనిసరిగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి వారి సహకారం కూడా తీసుకోవాలని అన్నారు.
గనులు భూగర్భ జలవనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ఎంపిడిఓ, పంచాయతీరాజ్, స్థానిక పోలీసుల సహకారం తీసుకొని గ్రామ సభలో నిర్వహించి తీర్మానం చేయాలని తెలిపారు .
ఈ సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, గనులు భూగర్భ జలవనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్, గ్రౌండ్ వాటర్ డి డి రాజేంద్రకుమార్, ఇరిగేషన్ ఈ ఈ చక్రధర్, టి ఎస్ ఎం డి సి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఈ ఈవెంకట్ రెడ్డి ,డి పి వెంకటేశ్వర్లు,టి ఎస్ హెక్ ఈ ఈ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.

Share This Post