MBNR – ఈ సంవత్సరం నిర్వహించనున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

ఈ సంవత్సరం నిర్వహించనున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
బుధవారం మహబూబ్ నగర్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు .ఉత్సవాల నిర్వహణకు ఆయా శాఖల తరఫున పూర్తి సహకారం అందించడం జరుగుతుందని, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, ప్రత్యేకించి పరిశుభ్రత, తాగునీరు ,ఎలక్ట్రిసిటీ ,పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు గతంలో మాదిరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 18 నుండి 20 వరకు మద్యం అమ్మకాలను నిషేధిస్తమని వెల్లడించారు. పూర్తి గా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం జరుగుతుందని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 08542- 241165 కు తెలియజేయాలని కోరారు.
జిల్లా ఎస్ పి ఆర్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ ఏలాంటి సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ఇందుకుగాను అందరు పూర్తి సహకారం అందించాలని ,పోలీసు శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైక్ లను ఉపయోగించాలని,డి జే లకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ శాఖ ద్వారా అధికారికంగా తీసుకోవాలని చెప్పారు .మండపాల ఏర్పాటుకు నూటికి నూరు శాతం ఆన్లైన్ అనుమతి తీసుకోవాలని అన్నారు. వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ఇబ్బందులు కలుగకుండా పట్టణంలోని రహదారులపై చిన్నచిన్న మరమ్మతులు చేపట్టాలని, వేలాడే వైర్లు,చెట్ల కొమ్మలను తొలగించాలని, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున నిమజ్జనంకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు. నిమజ్జనం రోజున ట్రాఫిక్ మళ్లింపు వివరాలను ముందే తెలియజేస్తామని, వినాయక మండపాల ఏర్పాటు నిర్వహణ కమిటీలు పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఉత్సవాల సందర్బంగా ఎలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపారు. ఏదైనా సమాచారం అందించేందుకు డయల్ 100 కు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా ఎస్పీ కోరారు .
శాంతి కమిటీ సభ్యులు పలువురు మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన శానిటేషన్ చర్యలు చేపట్టాలని, రహదారుల మరమ్మతు చేయించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీరు, నిమజ్జనం రోజున క్లాక్టవర్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కోవిడ్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ,పట్టణంలో కుక్కలు, పందుల వంటివి లేకుండా చూడాలని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు.
జిల్లా రెవెన్యూ అధికారి కె. స్వర్ణలత, డీఎస్పీ శ్రీధర్, శాంతి కమిటీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

Share This Post