MBNR – ఉపాధి హామీ పథకం కింద దివ్యాంగ కూలీలకు ప్రాధాన్యత- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.

ఉపాధి హామీ పథకం కింద దివ్యాంగ కూలీలకు ప్రాధాన్యత- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.
ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే దివ్యాంగ కూలీలకు అన్ని అంశాలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు 30 శాతం తక్కువ పని చేసినప్పటికీ సకలాంగు లతో సమానంగా వేతనం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంతేకాక సకలాంగులకు 100 రోజుల పనిదినాలు కల్పిస్తే దివ్యాంగ కూలీలకు 150 రోజుల పనిదినాలు కల్పించడం జరుగుతుందని, పని ప్రదేశంతో సంబంధం లేకుండా 5 కిలోమీటర్ల వరకు దివ్యాంగ కూలీలకు 10 రూపాయలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందని ,వారు కోరుకున్న చోటనే పనులు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
శనివారం రెవెన్యూ సమావేశ మందిరంలో ఉపాధి హామీ దివ్యాంగ కూలీలకు ఉద్దేశించి నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో దివ్యాంగులకు సంబంధించి ఉపాధి హామీ పథకం, సంక్షేమ శాఖ, ఇతర శాఖల ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు ,వసతులు, తదితర అంశాలపై చర్చించారు. అంతేగాక పెన్షన్లు, సదరం ధ్రువ పత్రాల పై కూడా చర్చ జరిగింది .
ఉపాధి హామీ పథకంలో పని చేసే దివ్యంగ మేట్ల కు కూడా కనీస వసతులు కల్పించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. కొత్తగా దివ్యాంగ కూలీలను గుర్తించి వారితో శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటు చేసి వారికి అవకాశం ఇవ్వాలని, అంతేకాక వారికి జాబ్ కార్డులు ఇవ్వాలని ఆయన సూచించారు.
జిల్లాలో 12800 మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తుండగా, అందులో 6300 మంది మహిళలే ఉన్నట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు.
సదరం శిబిరాల పై ఆయన మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్లు పొందాలనుకొనే దివ్యాంగులు ముందుగా స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికెట్లు పొందవచ్చని సూచించారు.
జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధితో పాటు, క్యాలిబర్లు, వినికిడి యంత్రాలు, ఆయా విద్యా సంస్థలు,ఇతర సంస్థలలో దివ్యాంగులకు ర్యాంపు ల నిర్మాణం, అవసరమైన వసతుల కోసం సహకరించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా అందరికన్నా ఎక్కువ పనిచేసిన రాజాపూర్,హన్వాడ,భూత్పూర్ మండలాలకు చెందిన 3 దివ్యాంగ కూలీలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
డిఆర్డిఓ యాదయ్య ,అదనపు పి డి శారద, మెప్మా నుండి యాదయ్య, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post