MBNR – ఉపాధ్యాయులు పాఠాలతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించామని, వీటన్నింటిని గ్రామాలలో ప్రజలకు సాహిత్యం ద్వారా తెలియ జేయాలని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .
సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పిఆర్టియు స్వర్ణోత్సవ సంబరాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల గురించి ఆలోచించే అతిపెద్ద సంస్థ పిఆర్టియు అని అన్నారు .తెలంగాణ ఉద్యమంలో పిఆర్టియు ప్రముఖ పాత్ర పోషించిందని, తెలంగాణ సాధించేందుకు ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారని, సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణను ముఖ్యమంత్రి నిలిపారని,70 ఏళ్లలో 100 హాస్టళ్లు ఉండగా తెలంగాణ వచ్చాక 1000 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని, పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల జీతభత్యాలను కూడా ఎన్నో రెట్లు పెంచామని, ఉపాధ్యాయులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి గౌరవం ,గుర్తింపు ఉందన్నారు.
ఉద్యోగులకు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అత్యధికంగా పి ఆర్ సి 30 శాతం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఒకసారి పి ఆర్ సి ఇస్తుండగా కేవలం 15 శాతం మాత్రమే జీతాలు పెంచిందని ,కానీ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో 73 శాతం పెంచిందని తెలిపారు .ఔట్సోర్సింగ్ ,కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 30% జీతాలు పెంచిన ఘనత తమదేనని అన్నారు.
గ్రామాలలో విద్యుత్ కొరత లేకుండా సమస్యను తీర్చడమే కాకుండా రైతు వేదికలు, రైతుబంధు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ,అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, కల్యాణలక్ష్మి పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని అందువల్ల ఉపాధ్యాయులు తెలంగాణ వచ్చిన తర్వాత ఊహించని అభివృద్ధి పై గ్రామస్తులతో చర్చించాలని చెప్పారు. ఉదండాపూర్,కరివేన రిజర్వాయర్లు పూర్తయితే పరిగి నియోజకవర్గంలో సంవత్సరం పాటు నీటితో పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు.
పిఆర్టియు సంఘ సభ్యులు తాము సంఘానికి ఏం చేస్తున్నామో ఆలోచించాలని, క్రమశిక్షణతో ఉండి రాష్ట్ర కార్యవర్గం ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు .త్వరలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పిఆర్టియు సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలని ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని మంత్రి వెల్లడించారు.
ఎం ఎల్ సి కాటేపల్లి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్టియు సంఘం తరఫున ప్రస్తుతం పొందుతున్న పీఆర్సీ సాధించడమే కాకుండా, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవు, సిపిఎస్ ఎన్నో విజయాలను సాధించామని, సభ్యులు అందరూ సంఘటితంగా ఉండాలని ,వ్యవస్థను కాపాడుకోవటం, సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తున్నామని, పిఆర్సి రావడంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పాత్ర కీలకమని అన్నారు. జిల్లా రూపురేఖలను మార్చడంలో మంత్రి చేసిన కృషి మరువలేనిదని, గతంలో వలసలు వెళ్ళిన ప్రజలు తిరిగి వస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ స్థానం ఉందని, పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు నారాయణ గౌడ్, కార్యదర్శి రఘురాం రెడ్డి, మండల మండల అధ్యక్షులు విజయానంద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గౌడ్, పలువురు విశ్రాంత ఉపాధ్యాయులు, సంఘం భాద్యులు, నాయకులు ఆర్డిఓ పద్మశ్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, జెడ్పిటిసి ,ఎంపీపీ, పిఎసిఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,సర్పంచ్లు పార్వతమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
ఈ సందర్భంగా పిఆర్టియు మండల శాఖ మంత్రిని,ఎం ఎల్ ఏ,ఎం ఎల్ సి ల ను ఘనంగా సన్మానించారు.

Share This Post