MBNR – ఎలాంటి తప్పులు లేని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడంలో రాజకీయ పక్షాల సహకారం ఎంతో అవసరమని మహబూబ్ నగర్ జిల్లా ఓటర్ జాబితా పరిశీలకులు,రాష్ట్ర హోమ్ శాఖ కార్యదర్శి ఎం. చంపాలాల్ అన్నారు.

ఎలాంటి తప్పులు లేని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడంలో రాజకీయ పక్షాల సహకారం ఎంతో అవసరమని మహబూబ్ నగర్ జిల్లా ఓటర్ జాబితా పరిశీలకులు,రాష్ట్ర హోమ్ శాఖ కార్యదర్శి ఎం. చంపాలాల్ అన్నారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ అయినప్పటికీ, ఎలాంటి తప్పులు లేకుండా, స్వచ్ఛమైన ఓటర్ జాబితాను తయారు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన యువతను తప్పనిసరిగా ఓటర్ జాబితా లోకి తీసుకురావాలని, చనిపోయిన, శాశ్వితంగా వలస వెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడం ,మార్పులు,చేర్పుల వంటి విషయంలో రాజకీయ పార్టీల పాత్ర ముఖ్యమని అన్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1 నుండి 31 వరకు క్లెయిమ్స్ స్వీకరణ ఉంటుందని, జనవరి 5న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 6 ,7 ,26 ,27 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ,బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల లోనే ఉంటారని అక్కడే క్లెయిమ్స్ సమర్పించ వచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చన్నారు. అయితే ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు విషయంలో పెద్ద మొత్తంలో ఏ రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ క్లెయిమ్స్ సమర్పించడానికి వీలు లేదని ఓటరు జాబితా పరిశీలకులు స్పష్టం చేశారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని,పత్రికలు, స్థానిక కేబుల్ ఛానల్ల ద్వారా ప్రచారం నిర్వహించడం, అవసరమైన చోట హోర్డింగు ల వంటివి ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని,బి ఎల్ ఓ లు గా పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లు,సూపర్వైజర్లకు కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి చైతన్యం చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితానుండి చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్లిన ఓటర్ల పేరు తొలగింపు , ఫారం -6-,7,7A వంటి కార్యక్రమాలను అన్ని బూతు స్థాయిలో నిర్వహించడం జరుగుతున్నదని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ విషయమై ఇదివరకే సమావేశం. నిర్వహించడం జరిగిందని, అంతేకాక ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను తెలియజేశామని, గరుడ యాప్ గురించి కూడా తెలియజేయడమే కాక, ముసాయిదా ఓటర్ జాబితాను కూడా పొలిటికల్ పార్టీలకు ఇవ్వటం జరిగిందని తెలిపారు .
సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సాయిబాబా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు తమకు పూర్తి స్థాయిలో తెలియజేస్తారని, అయితే ఎక్కడైనా పోలింగ్ కేంద్రం పెరిగినట్లయితే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడే ఓటు వచ్చేలా చూడాలని సూచించారు .
సీపీఐ తరపున హాజరైన ఎం. రామ్మోహన్ మాట్లాడుతూ ఒక వార్డ్ లో ఉండే ఓటర్ కు అదేవార్డు లో ఓటు హక్కు కల్పించాలని చెప్పారు.
బిజెపి తరఫున సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పై అవగాహన కల్పించాలన్నారు.
బిఎస్పీ నుండి హాజరైన ఆదిలక్ష్మయ్యమాట్లాడుతూ స్థనిక కేబుల్ ఛానళ్లు,హోర్డింగుల ద్వారా ప్రచారం కల్పించాలని కోరారు.
ఈ సమావేశానికి సిపిఐ ఎం తరఫున రవీందర్ ,వైఎస్ఆర్సీపీ తరఫున బి డి శామ్యూల్, టిడిపి తరఫున బాలప్ప, ఏఐఎం ఐ ఎం తరఫున సాధాతుల్లా హుస్సేని, రెవిన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డిఓ పద్మశ్రీ, జడ్పీ సీఈఓ జ్యోతి ,డిఆర్డిఓ యాదయ్య, కలెక్టరేట్ ఏ ఓ ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు ఓటర్ జాబితా పరిశీలకులు చంపాలాల్ మాడ్రన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో స్వీకరిస్తున్న అభ్యంతరాలను, దరఖాస్తులను పరిశీలించారు. అంతేగాక కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులపై ఓటర్లకు కల్పిస్తున్న అవగాహనపై అడిగి తెలుసుకున్నారు.
ఉదయం ఆయన బాలనగర్, రాజాపూర్ తదితర మండలాలలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై తనిఖీ చేశారు.

Share This Post