MBNR – కుల, వృత్తుల పరిరక్షణకు ప్రాధాన్యం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ. శ్రీనివాస్ గౌడ్.

@ కుల, వృత్తుల పరిరక్షణకు ప్రాధాన్యం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ. శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో కుల వృత్తులను పరిరక్షించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఎక్సైజ్ , క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా ,మహబూబ్ నగర్ మండలం, కోడూరు గ్రామం లోని మైసమ్మ చెరువులో “6 వ విడత చేప పిల్లల విడుదల” కార్యక్రమంలో భాగంగా సుమారు 60 వేల చేపపిల్లలను చెరువులో వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మత్స్య శాఖకు 23 జిల్లాలకు కలిపి కేవలం 2 కోట్ల రూపాయలు కేటాయించగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉచితంగా చేపపిల్లలను వదిలెందుకు 4,5 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. గతంలో సముద్రాల వద్ద మాత్రమే దొరికే చేపలు ప్రస్తుతం గ్రామాల నుండి నగరాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి వచ్చాయని తెలిపారు. ముదిరాజులు, మత్స్యకారుల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల విలువైన చేపపిల్లలను ఉచితంగా ఇస్తున్నదని అన్నారు. గతంలో కృష్ణా నది తీర ప్రాంతం నుండి దౌర్జన్యంగా చేపలను తీసుకు వెళ్లేవారని మంత్రి అన్నారు. మత్స్య శాఖ ద్వారా 5 వేల కోట్ల రూపాయలను కేటాయించి మత్స్యకారులకు లూనాలు,మిని ఆటోలు,వలలు,డి సి ఎం ల్ వంటివి అందజేయడం జరుగుతున్నదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి తో పాటు, వ్యవసాయ, అనుబంధ రంగాల ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నదని, ఇందులో భాగంగా అన్ని చెరువులలో పూడిక తీస్తే రైతులకు సాగునీరు అందడంతో పాటు, చెరువులపై ఆధారపడిన మత్స్య, ఇతర పాడి పశువుల రంగాలు అభివృద్ధి చెందుతాయని భావించి పెద్దఎత్తున ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతున్నదని వెల్లడించారు.
ప్రతి వృత్తికి గౌరవం దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని,పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు ల ద్వారా అన్ని చెరువులను నీటితో నింపి రెండు పంటలు పండే అవకాశాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. రైతులు కులాల వారు బాగుపడినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
హైదరాబాద్ నగరంలో కూడా కోట్ల రూపాయల విలువైన భూముల ను విభిధ కుల వృత్తుల వారికి స్థలాలు, భవనాలను నిర్మించిందని, ముదిరాజుల కోసం 300 కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించడమే కాకుండా ,5 కోట్ల రూపాయలతో భవన నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, మత్స్య శాఖ ఏ డి రాదారోహిణి, మహబూబ్ నగర్ రూరల్ తాహసిల్దార్ పాండు, ఎం పి డి ఓ వేదవతి జే పీ ఎన్ సి చైర్మన్ రవి కుమార్,నర్సింహులు,విజయ్, తదితరులు ఉన్నారు.

 

Share This Post