MBNR – కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తా – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.

@ 2022 నూతన సంవత్సరంలోమహబూబ్ నగర్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయటం
@ బై పాస్ పనుల పూర్తి , చిన్నదర్పల్లి వరకు కొనసాగింపు
@మరిన్ని కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తా – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.
కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులు కలగాలని, కుటుంబాలు అభివృద్ధి చెందాలని, ఏలాంటి వ్యాధులు దరిచేరకుండా భగవంతుడు అందరిని చల్లగా చూడాలని ,కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఇంకా పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
శుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు, జిల్లా అధికారులతో పలు విషయాల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కష్టపడి తెచ్చుకున్న మన తెలంగాణను మనమే అభివృద్ధి చేసుకోవాలనే సిద్ధాంతంతో జిల్లా అధికారులు అందరూ కష్టపడి పనిచేస్తున్నారని ,ఇందుకుగాను మంత్రి అభినందించారు. ఇప్పటికే జిల్లాలో అభివృద్ధి పరంగా అనేక మార్పులు సాధించామని, ఇదే స్ఫూర్తిని కొనసాగించి జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు,అధికారులు సహకారం అందించాలనికోరారు.
2022 నూతన సంవత్సరంలో మహబూబ్ నగర్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయటం, బై పాస్ పనుల పూర్తి , చిన్నదర్పల్లి వరకు కొనసాగింపు,
మరిన్ని కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడమే లక్ష్యంగా తాను పని చేస్తానని,జిల్లా అధికారులు కూడా వారి శాఖ ద్వారా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని ఆయన కోరారు.
కరోనా కొత్త వేరియాంట్ ఒమిక్రాన్ పై మంత్రి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మొదటి, రెండవ దశలలో అధికారులందరూ బాగా పని చేశారని, హైదరాబాదు నుండి కూడా మహబూబ్ నగర్ కి వచ్చి చికిత్స పొందారన్నారు. 2014 ముందు జిల్లా లో ఒక ఐ సి యు బెడ్ కూడా లేదని, ఇప్పుడు 70 పడకల ఐ సి యు బెడ్లు, అదేవిధంగా 540 ఆక్సీజన్ బెడ్లు ఉన్నాయని,2 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ,ఒక ఆక్సిజన్ స్టోరేజ్ ప్లాంట్ ఉన్నాయని తెలిపారు. ఇవే కాకుండా నూతన సంవత్సరం లో మూడు నుండి నాలుగు వందల కోట్ల రూపాయలతో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేస్తామని, మహబూబ్నగర్లో అన్ని వైద్య సదుపాయాలు కల్పించడం, పక్కా రాష్ట్రాలు, జిల్లాల నుండి చికిత్స కోసం జిల్లాకు వచ్చేలా నిమ్స్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు.
ఒమిక్రాన్ పట్ల భయపడకుండా ప్రతి గ్రామంలో ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చెప్పాలని ,వంద శాతం వాక్సిన్ పూర్తి చేసుకోవాలని అలా పూర్తి చేసుకున్న గ్రామాల సర్పంచులు, అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని మంత్రి తెలిపారు.
జిల్లాలో రైతుబంధు నిధులు 220 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తున్నామని, అధికారులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నది లేనిది పరిశీలించాలని ,ఈ విషయంపై గ్రామాలలోని రైతులందరికీ టామ్ టామ్ ద్వారా తెలియజేయాలని, ప్రభుత్వం కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపకుండా ఇచ్చిన విషయాన్ని తెలియ చెప్పాలి అని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నేపథ్యంలో జనవరి 2 నుండి 7 వరకు వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని, వైద్యాధికారులు కోవిడ్ టెస్టుల శాతాన్ని పెంచాలని, అవగాహన కార్యక్రమం నిర్వహించిన తర్వాత కూడా ఎవరైనా కోవిడ్ నిబంధనలు పాటించకపోతే గతంలోలాగా అన్ని స్తాయిలలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి జరిమానా విధించాలని, రైతుబంధు నిధులను రైతులకు పంపిణీ చేస్తున్న దృష్ట్యా బ్యాంకులు వద్ద పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు పోలీసు అధికారులు కూడా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఒమిక్రాన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా స్వయం సహాయక బృందాలలో రెండు రోజుల పాటు చిన్న సంఘాలు, పెద్ద సంఘాలలో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ,పట్టణ స్థాయిలో కూడా మురికివాడల్లో ఎస్ ఎల్ ఎఫ్ మీటింగులు నిర్వహించి చెప్పాలని అన్నారు. 15 నుండి 18 సంవత్సరాల వయసున్న పిల్లలకు కూడా వాక్సిన్ ఇచ్చే అవకాశం ఉన్నందున అందుకు వైద్య అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. గ్రామాలలో తహశీల్దార్లు, ఎంపిడివోలు అవసరమైతే క్వారన్ టైన్ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ముందునుండే సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు .
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ ,జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

 

 

 

 

Share This Post