MBNR – డిసెంబర్ 1 నుండి వారం రోజుల పాటు జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు వెల్లడి

@ డిసెంబర్ 1 నుండి వారం రోజుల పాటు జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు వెల్లడి
@ ప్రజలు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను వాడవద్దని విజ్ఞప్తి
పారిశుధ్య లోపం వల్ల ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.ఈ విషయంలో అధికారులతో పాటు, ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనట్లయితే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అంతేకాక ప్రజలు ఆరోగ్యం విషయంలో మందుల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందని ఆయన అన్నారు
గురువారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద నగర్,గంజ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లాలోని అందరూ మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ముఖ్యంగా యువజన సంఘాలు, యువత, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్లాస్టిక్,పాలిథిన్ కవర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు.
పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను డిసెంబర్ 1 నుండి 7 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం తో పాటు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కోరారు.

Share This Post