తల్లి దండ్రుల పై శ్రద్ధ చూపినట్లు గానే వయో వృద్ధుల పై శ్రద్ధ చూపించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.వయో వృద్ధుల పట్ల అవమానకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వయో వృద్ధులకు సంబంధించి ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని, మొదటి ,మూడవ శనివారం తప్పనిసరిగా సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు . ఎవరైనా వృద్ధుల పట్ల అవమాన కరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఈ సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పారు.
వృద్ధుల సంక్షేమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ,ఉప కేంద్రాలలో చికిత్స నిమిత్తం వచ్చినప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు .అదేవిధంగా ప్రతి బుధవారం ప్రత్యేకంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వృద్ధుల కోసం ప్రత్యేక ఓ పి ఏర్పాటు చేయాలని చెప్పారు. అవసరమైతే మందులకోసం సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి తెప్పించి ఇవ్వాలని, బీదలకు ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ధరణి ప్రత్యేక సెల్ లో అనేకమంది వయోవృద్ధులు ఫిర్యాదులను అందజేయడంలో ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల రెవెన్యూ శాఖలో పని చేసి విశ్రాంతి పొందిన ఉద్యోగులు వయో వృద్ధులకు ప్రత్యేకించి రైతన్నలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వయో వృద్ధులను సత్కరించారు.
సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు జగపతిరావు, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, విఐపి నాగేంద్ర స్వామి తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పద్మశ్రీ ,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ, నాగభూషణం, సుబ్బయ్య, పాండురంగం, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.