MBNR – దళితులను నేరుగా ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

దళితులను నేరుగా ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో దళిత బందు పై మహబూబ్ నగర్ ,నారాయణ పేట జిల్లాల ఎంపిలు ,శాసనసభ్యులు, జిల్లా కలెక్టలు,అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు కులవృత్తులను ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రైతులకు ఉచిత విద్యుత్ ,రైతు బంధు,రైతుబీమా ఇస్తూనే వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని,అలాగే అన్ని కులవృత్తులవారు బలపడేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
ఎస్సీలు సమాజానికి దూరంగా ఉన్నారని, దళిత బంధు ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముందుగా ఎస్ సి లకు, ఆ తర్వాత దశలవారీగా దళిత, వెనుకబడిన వర్గాలకు కూడా అమలు చేస్తామని తెలిపారు. దళిత బంధు అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని, ఈ పథకం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు .
ఈ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, మొదటి విడత నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులకు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, పరిశ్రమలు ఇతర రంగాలలో డిమాండ్ ఉన్న యూనిట్లను గుర్తించి లబ్ధిదారులకు లాభం చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను తక్షణమే వారి వారి శాఖల ద్వారా అమలు చేసే యూనిట్ల పై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా కష్టం హైరింగ్ కేంద్రాలు, పౌల్ట్రీ, బర్రెలు ,పాడి పరిశ్రమ, ఇండస్ట్రీస్, మార్కెటింగ్ ,సెంట్రింగ్, బ్యాక్ యార్డ్, వరి నాటే యంత్రాలు, ట్రాన్స్పోర్ట్, ఆటో ట్రాలీ ,ఎరువులు, విత్తనాల వంటి యూనిట్లు గుర్తించాలని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాలలో యూనిట్లను గుర్తించి రేపటిలోగా ప్రణాళిక సమర్పించాలన్నారు .
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దళిత బందు పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి కల అని, ఈ పథకం కింద ఆయా యూనిట్ల ఏర్పాటు కు ఎంత అవుతుందో అధికారులు విశ్లేషణ చేయాలని, ముఖ్యంగా వ్యవసాయం, సేంద్రియ ఎరువులు ,పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని,ఈ పథకాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకం ఆదర్శవంతమైనదని, ఈ పథకం అమలులో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు.
నారాయణపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజ మాట్లాడుతూ దళిత బంధు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు, వారు బాగు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మాట్లాడుతూ దళిత బంధు కింద నర్సరీలు, ఉద్యాన పంటలు, ఆస్పత్రులలో సేవలు, హాస్టళ్లలో వంట యూనిట్లు,వంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, మొదటి విడత యువతను ఎంపిక చేయాలని, ఇద్దరు ముగ్గురు కలిసి ఒక యూనిట్ ని పెట్టుకునే లాగా ప్రోత్సహించాలని సూచించారు .
నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ దళిత బంధు పథకం కింద ప్రతి కుటుంబానికి నేరుగా వారి అకౌంట్ లోనే నిధులు జమ అవుతాయని, ముందుగా శాసనసభ్యులు లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత లబ్ధిదారులకు నైపుణ్యాలు అభివృద్ధి అయ్యేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద చేనేత కార్మికుల యూనిట్లు పెట్టాలని, ఇతర రుణాలను కూడా ఈ పథకానికి అనుసంధానం చేస్తే బాగుంటుందని,స్త్రీ నిధికి కూడా దీనిని అనుసంధానం చేయాలని సూచించారు.
మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశంలోనే గొప్ప పథకమని, ప్రతి ఒక్కరికీ లాభం వచ్చేలా చేయాలని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని ,రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి తెచ్చిన ఈ పథకం అమలుకు అందరూ సహకరించాలని కోరారు.
దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ముందుగా యువతను చైతన్యం చేయాలని, ముఖ్యంగా పాడి పరిశ్రమ, వ్యవసాయం ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
నారాయణపేట శాసనసభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దళితుల ఆర్థిక పరిపుష్టికి ఈ పథకం ఎంతో బాగుందని, ఈ పథకం కింద మెడికల్ షాపులు,డయాగ్నిస్టిక్ కేంద్రాలు ,రెడీ మిక్స్ ప్లాంట్ లు, మెకానిక్ షాప్ ల వంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు.
పరిగి శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకం అద్భుతమైన కార్యక్రమమని, ముందుగా అర్హులైన వందమందిని ఎంపిక చేయాలని, ఈ పథకం జిల్లాలో రోల్ మోడల్ గా ఉండేలా చూస్తామని, అందరూ ఒకేలాంటి యూనిట్లు పెట్టకుండా వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా లబ్ధి పొందేలా చూడాలన్నారు.
కొడంగల్ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యూనిట్లఎంపిక చేయాలని, వ్యవసాయ ,అనుబంధ రంగాల ద్వారా అభివృద్ధి చెందేలా యూనిట్లు ఇస్తే బాగుంటుంది అని తెలిపారు.
షాద్ నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయం, పాడి పరిశ్రమ యూనిట్లను ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని, అలాగే చిన్నతరహా పరిశ్రమలపై దృష్టిసారించాలని, ముందుగా లబ్ధిదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించాలని ,లబ్ధిదారులకు లాభం చేకూర్చేలా ఉండాలని అన్నారు.
ఈ సమావేశానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, నారాయణపేట అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ,మహబూబ్ నగర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.

 

 

 

Share This Post