MBNR – దేవరకద్ర నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్, డబుల్ బెడ్ రూమ్, ఆర్అండ్ బి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.

దేవరకద్ర నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్, డబుల్ బెడ్ రూమ్, ఆర్అండ్ బి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.
ముఖ్యంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, గ్రావిటీ కెనాల్ కు సంబంధించిన 25 ఎకరాల భూ సేకరణ కు వెంటనే సవరణ ప్రణాళికను మూడు రోజుల్లో సమర్పించాలని ఆర్టీవో తో పాటు, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 224 ఎకరాల భూసేకరణలో 50% కేనాల్స్ పూర్తికాగా, అందుకు సంబంధించిన చెల్లింపులు, బిల్లులను చేయడంతో పాటు తక్కిన 50 శాతం కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. రైట్ కెనాల్ కెనాల్ కు సంబంధించిన సమస్యల పై కూడా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కి సంబంధించి ఆయా గ్రామాలలో పెండింగ్ లో ఉన్న గృహాలను పూర్తి చేసేందుకు ఒక నిర్ధారిత తేదీ నిర్ణయించాలని, నియోజకవర్గంలో వడ్డేపల్లి, జానంపేట, ముచింతల, నర్సింగాపూర్, పేరూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేసేందుకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నవంబర్ నుండి మార్చి వరకు ఆఖరు తేదీలను నిర్ణయించారు.
ఆర్ అండ్ బి పనుల పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ దేవరకద్ర పట్టణంలో చేపట్టిన ఆర్ ఓ బి పనులను వెంటనే పూర్తి చేయాలని, ఆక్రమణలను తొలగించాలని అన్నారు. గ్రామపంచాయతీలో సుందరీకరణ పనులు చేపట్టాలని,పట్టణంలో 2 పార్కులు చేపట్టాలని వీటి బాధ్యతను డి పి ఓ కు అప్పగించారు. పట్టణ సుందరీకరణకు ప్రణాళిక రూపొందించాలన్నారు. అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ కు సంబంధించిన పనుల వైపుగా దృష్టి సారించాలని అన్నారు .
దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇరిగేషన్, డబుల్ బెడ్ రూమ్, ఆర్ అండ్ బీ కి సంబంధించినపనుల పురోగతి పెంచాలని, అధికారులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నూటికి నూరు శాతం ప్రాజక్టులు త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నదే తమ అభిమతమని తెలిపారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద గ్రావిటీ కెనాల్ లో ఇంకా 25 ఎకరాల భూసేకరణ వల్ల పనులు ఆగిపోయాయని ,అందువల్ల తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని, భూసేకరణకు సంబంధించి పేమెంటు కూడా చేయాలని, లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 224 ఎకరాల సమస్య వెంటనే పరిష్కరించాలని, రైట్ కెనాల్, గ్రావిటీ కెనాల్ సమస్యలను పరిష్కరించడం పై ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించాలని కోరారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కి సంబంధించి నియోజకవర్గానికి 1300 గృహాలు మంజూరు కాగా ఇంకా అనేక గ్రామాలలో ఇండ్లు పూర్తి చేయాల్సి ఉందని, ఎంతో బాధ్యతతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని,అందు వల్ల అధికారులు ఇండ్ల నాణ్యత పై దృష్టి సారించాలని అన్నారు .
ఆర్ అండ్ బి పనులకు సంబంధించి దేవరకద్ర పట్టణంలో చేపట్టిన ఆర్ ఓ బి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, వేముల రహదారిని కొజెంట్ కంపెనీ వరకు తక్షణమే పూర్తి చేయాలని, కురుమూర్తి జాతర సందర్భంగా రహదారుల మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ,జిల్లా ప్రాజక్టుల సి ఈ రమేష్, ఆర్టీవో పద్మశ్రీ , తహశీల్దార్ జ్యోతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి శ్రీనివాస్, డిపిఓ వెంకటేశ్వర్లు ,పంచాయతిరాజ్ ఈ ఈ నరేందర్ ,హౌసింగ్ ఈ ఈ వైద్యం భాస్కర్ ,ఇరిగేషన్ ఎస్ఇ నర్సింగరావు, అర్ అండ్ బి ఈ ఈ స్వామి, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎంపీపీ ,జడ్పిటిసి తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

Share This Post