MBNR – పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకం వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు.

పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకం వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ మండలం అప్పన్నపల్లి సమీపంలోని రైతు బాలకృష్ణ సాగు చేస్తున్న అంజీర తోటను పరిశీలించారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో బాలకృష్ణ అంజీరా తోటను సాగు చేస్తుండగా తెలుసుకొని జిల్లా కలెక్టర్ బాలకృష్ణతో స్వయంగా మాట్లాడారు. ఎన్ని ఎకరాలు సాగు చేశారని? ఎంత ఖర్చు వస్తుందని? ఎంత లాభం వస్తుందని అడిగారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఉద్యాన పంటల వైపు దృష్టిని మళ్ళించాల్సిన అవసరం ఉందని ,ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం, కూరగాయలు, పూల తోటల పెంపకం పై దృష్టి సారించాలని కోరారు. జిల్లా అవసరాలకు సరిపోయే విధంగా పండ్లు ,కూరగాయలు, పూలను పండించడంతో పాటు, మిగులును ఇతర జిల్లాలు, రాష్ట్రానికి పంపించే విధంగా జిల్లా రైతులు స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కోరికమేరకు రైతులందరూ సాంప్రదాయంగా పండించే పంటల పై కాకుండా ఉద్యాన పంటల వైపు దృష్టిని సారించాలని అన్నారు.ఇందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందిస్తుందని తెలిపారు .
కాగా బాలకృష్ణకు ఉద్యాన శాఖ తరఫున సబ్సిడీ పై డ్రిప్ సౌకర్యం తో పాటు మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఎకరాకు పదివేలు చొప్పున లక్ష రూపాయల సహకారం అందించినట్లు హార్టికల్చర్ డిడి సాయిబాబా కలెక్టర్ కు వివరించారు.
అంజీరా కు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొస్తే ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో గతంలో మాదిరి ద్రాక్ష తోటలను సాగు చేసే విషయంపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అంజీరా తోట రైతు బాలకృష్ణ మాట్లాడుతూ ఎకరాకు లక్షా 50 వేల నుండి లక్ష 60 వేల రూపాయల దాకా ఖర్చు వస్తుందని, గత ఐదు సంవత్సరాల నుండి తనకు దిగుబడి అందుతున్నదని, ఎకరాకు సుమారు లక్ష రూపాయలు లాభం వస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా కలెక్టర్ రైతు బాలకృష్ణను అభినందించారు.

Share This Post