MBNR – పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

@ పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

వచ్చేనెల 23 నుండి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు కోరారు.
గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష అభియాన్ సమావేశమందిరంలో పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
గడిచిన రెండేళ్లు కరోనా వల్ల పాఠశాలలు మూతపడడం, పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తం కావడం జరిగిందని, పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న దృష్ట్యా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాసేలా చూడాలని చెప్పారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరం జిల్లాలో పదవ తరగతిలో విద్యార్థులు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని, ఇందుకుగాను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహించాలని అన్నారు. పరీక్షలలో ఏలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా చూసుకోవాలని చెప్పారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన మన ఊరు -మన బడి ఒక బృహత్తర కార్యక్రమం అని , ఈ పథకం కింద జిల్లాలో 291 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరుగుతున్నదని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పదో తరగతి పరీక్షలకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు గానే మన ఊరు- మన బడి పనులకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, ఎప్పటికప్పుడు చేయబోయే పనులపై పక్కా ప్రణాళిక ఉండాలని, అలాగే రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకోవాలని చెప్పారు. హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు చదువుతోపాటు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పై కూడా దృష్టి సారించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.మన ఊరు-మన బడి కింద మొదటి విడత మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేస్తే వచ్చే అకాడమిక్ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు సౌకర్యాలను కల్పించిన వారమౌతామని, ఈ పథకం కింద మంజూరు చేసిన నిధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి ,ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

Share This Post