“పనే దైవం” నినాదంతో సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహాత్మా బసవేశ్వర 889 వ జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ లో ఉన్న మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహించడమే కాకుండా, ట్యాంక్ బండ్ పై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాక అన్ని జిల్లాలలో అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.
మహాత్మా బసవేశ్వర ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటి పార్లమెంట్ ను ఏర్పాటు చేసి కుల రహిత సమాజ స్థాపన కు కృషి చేసిన వ్యక్తి బసవేశ్వరుడని, అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని, దానం,ధర్మం, సమ సమాజం కోసం పాటుపడిన సామాజిక వేత్త అని కొనియాడారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మున్సిపల్ చైర్మన్ కె.సి నరసింహులు, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, డి సి సి బి ఉపాధ్యక్ష్యుడు కొరమోని వెంకటయ్య, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఇందిర, శ్రీశైలం,సత్యనారాయణ,పెద్ద రాములు యాదవ్,మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, తదితరులు మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి పూల మాలలు వేశారు.