MBNR – ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాము – జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు.

@ ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాము- జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు
ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల బారిన పడకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వెంకట రావు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు నమోదవుతున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజ్వి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఇందుకు సంబంధించి జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్ వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ,మలేరియా నివారణలో భాగంగా దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టామని, జిల్లాలో గుర్తించిన మురికి నీటి గుంటలలో 5 లక్షల గంబుషియా చేపలను వదిలినట్లు తెలిపారు. ఇంకా మత్స్య శాఖ నుండి అవసరమైన గంబుషియా చేపలను ఇప్పించాలని కోరారు. అంతే కాక ముందు జాగ్రత్త చర్యల పై ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు.దీనితో పాటు డెంగ్యూ ,మలేరియా జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధుల పై వైద్య ఆరోగ్య,స్థానిక సంస్థల అధికారులు,సిబ్బందిని మరో సారి అప్రమత్తం చేసేందుకు ఈ శనివారం సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లాలో 2019 సంవత్సరంలో 886 డెంగ్యూ కేసులు నమోదు కాగా , 2020 లో 113 కేసులు నమోదయ్యాయని తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖ సూచనలు,సలహాలు,జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు కేవలం 30 డెంగ్యూ కేసులు మాత్రమే నమోదయ్యాయని కలెక్టర్ వెల్లడించారు.
దోమలనివారణకుద్దేశించి ఇల్లిల్లు తిరిగే ప్రత్యేక కార్యకర్తలను మహబూబ్ నగర్ జిల్లాకు కేవలం 30 మందిని మాత్రమే ఇచ్చారని, అలాకాకుండా కనీసం 100 మందిని (బ్రీడింగ్ చెక్కర్స్) రెండు నెలల కాలానికి సరిపోయేలా ఇవ్వాలని కలెక్టర్ కోరారు .
గత సంవత్సరం ఇదే సమయంలో డెంగ్యూ, మలేరియా పై రాష్ట్ర స్థాయి అధికారుల బృందం జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ సంవత్సరం కూడా అలానే నిర్వహిస్తే బాగుంటుందని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజ్వి మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ,ముఖ్యంగా వీటి నివారణకై దోమల నివారణ చర్యలు చేపట్టాలని, వైద్య ఆరోగ్య, స్థానిక సంస్థలు, మున్సిపల్, గ్రామ పంచాయతీల అధికారులు,సిబ్బందితో సమావేశాలు నిర్వహించడం,నీరు నిలువ ఉండే ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వేయటం,గంబుషియా చేపలను వదలటం వంటివి చేయాలని, సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనెల అవగాహన కల్పించడం, అంతర్గత శాఖల అధికారుల సమన్వయ తో ముందుకు వెళ్లాలని సూచించారు .అంతేగాక ప్రతి వారం డ్రైడే నిర్వహించడం, ఎవరికైనా డెంగ్యూ, మలేరియా వంటి లక్షణాలు ఉన్నట్లయితే తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ వ్యాధులను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి విజయ్ కుమార్ హాజరయ్యారు.

Share This Post