MBNR – ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్.

@ప్రజలే మా దేవుళ్ళు
@ ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్
ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమా ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రం సమీపంలో ఊక చెట్టు వాగులో సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో చింతకుంట నుండి కురుమూర్తి వరకు నిర్మించనున్న కాజ్ వే కు, చెక్ డ్యామ్ పనులకు భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గడచిన 70 సంవత్సరాలలో తెలంగాణ వివక్షకు గురైందని, తెలంగాణ రాష్ట్రం సాధించిన ఏడేళ్లలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉచిత విద్యుత్ ,సాగునీరు, తాగునీరు, పెన్షన్లు, రైతుబంధు వంటి ఎన్నో అద్భుత పథకాలను అమలు చేస్తున్నామని, ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా ఈ పథకాలు అందన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, శాసనసభ్యులు ప్రజలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి పిలిస్తే పలికేలా అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రజల కోసం పని చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని, మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారు తలెత్తుకుని బ్రతకాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కే .చంద్రశేఖరరావు కోరికని అందుకు అనుగుణంగానే పని చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి చిన్న చింతకుంట మండలం స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు 2 కోట్ల 20 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.
ఈ సమావేశానికి హాజరైన మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏడు సంవత్సరాల కు ముందు తెలంగాణ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాత్రి,పగలు పేద ప్రజల కోసం కృషి చేస్తున్నారని, అలాగే మహబూబ్నగర్ను మాడల్ సిటీ గాచేసేందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 20 చెక్ డ్యాముల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, గతంలో నీళ్లు లేక ఎడారిగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్కలంగా నీరు అందుతుందని, చిన్నచింతకుంట మండలానికి కొత్తగా మూడు సబ్స్టేషన్ల తో పాటు, అన్ని గ్రామాలకు బి టి రహదారులు నిర్మించడం జరిగిందని,నియోజక వర్గంలో 2014 వరకు 66 గ్రామాలకు మాత్రమే ఈ సౌకర్యం లేదని తెలంగాణ వచ్చిన తర్వాత మరో 44 గ్రామాలకు బిటి సౌకర్యం కలుగ చేశామని, నియోజకవర్గంలో 60 ఏళ్లలో 187 తాగునీటి ట్యాంకులు ఉండగా కేవలం ఈ7 ఏళ్లలోనే 217 నిర్మించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా యాభై వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద రైతులకు ఇవ్వడం జరిగిందని, కల్యాణలక్ష్మి, పెన్షన్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర గిడ్డంగుల,సహకార సంస్థ అధ్యక్షులు సాయి చంద్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్ మోహన్ ,రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ,భూత్ పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్, ఎంపీపీ హర్షవర్ధన్, జెడ్పిటిసి రాజేశ్వరి తదితరులు హాజరయ్యారు.

 

 

 

Share This Post