ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం పూర్తి నాణ్యతతో ఉండాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు.
బుధవారం తన చాంబర్లో నిర్వహించిన జిల్లా పరిషత్తు నాల్గవ స్థాయి సంఘ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.
విద్య ,వైద్యంపై సమీక్ష జరిగిన ఈ సమావేశంలో జెడ్ పి చైర్ పర్సన్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పూర్తి నాణ్యతగా ఉండాలని, ఎక్కడ అపరిశుభ్రంగా ఉండకూడదని ,మధ్యాహ్నం భోజనం కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, అందువల్ల అధికారులు మధ్యాహ్నం భోజన పథకం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వంట ఏజెన్సీలకు సాధ్యమైనంతవరకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ దోమల నివారణ పై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, ఇందుకుగాను గ్రామాలలోని మహిళా సంఘాలలో కూడా చర్చించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా తో పాటు, ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా ,ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నిటిపై ముందు జాగ్రత్త చర్యలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు.
మహబూబ్ నగర్ పట్టణంలోని డైట్ కళాశాల, అదేవిధంగా బీఈడీ కళాశాలలో టాయిలెట్ల సౌకర్యం లేదని సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్ సమావేశం దృష్టికి తీసుకురాగా తక్షణమే వాటి మంజూరి కోసం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ ,విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు .
ఈ సమావేశానికి జిల్లా పరిషత్తు నాలుగవ స్థాయి సంఘం సభ్యులు రాజాపూర్ జెడ్పిటిసి మోహన్ నాయక్, జెడ్ పి కో ఆప్టెడ్ సభ్యులు అన్వర్ హుస్సేన్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ,వైద్య ఆరోగ్యశాఖ నుండి డెమో తిరుపతిరావు, డిప్యూటీ సీఈవో మొగులప్ప, డిప్యూటీ ఇంజనీర్ రాములు తదితరులు హాజరయ్యారు.