MBNR – ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులకు భరోసా కల్పించాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.

ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులకు భరోసా కల్పించాలి- జిల్లా కలెక్టర్ఎస్. వెంకట రావు
కరోనా కారణంగా 16 నెలలపాటు మూతపడిన పాఠశాలలు బుధవారం తెరుచుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మహబూబ్ నగర్ సమీపంలోని బోయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిశుభ్రతను, విద్యార్థుల హాజరు తదితర వివరాలను హెడ్ మాస్టర్,ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు .
అయితే జిల్లా కలెక్టర్ సందర్శన సమయంలో బోయ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను వరండాలోనే కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తుండడం పట్ల ఆయన ఆసహనం వ్యక్తం చేస్తూ ప్రధానోపాధ్యాయురాలు వసంత యామినికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని డి ఈ ఓ ను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం ,15 రోజులుగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిని శుభ్రం చేయటం, హైపో క్లోరైడ్ ద్రావణంపిచికారి చేయడం,మరుగుదొడ్లు,ఆట స్థలాలు,వంట గదులు,తాగు నీటి వనరుల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను యావత్తు జిల్లా యంత్రాంగం దగ్గరుండి పర్యవేక్షించిందని అన్నారు.
తరగతి గదులు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంతో విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం బాధాకరమని అన్నారు. ఇందుకుగాను కారణాలు తెలియజేయవలసిందిగా కోరుతూ హెడ్ మాస్టర్ వసంతయామిని కి ఛార్జ్ మెమో జారీ చేయాలని డి ఈ ఓ ను ఆదేశించారు .
పాఠశాల ఆవరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పాఠశాలలో హరితహారం కింద నాటిన మొక్కలు బాగా పెరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని ఖాళీ స్థలాల్లో ఇంకా మొక్కలు నాటాలని సూచించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ,ప్రధానోపాధ్యాయులు,పిల్లల తల్లితండ్రులు పిల్లలను పాఠశాలల కు పంపించే విషయంలో బలవంతం చేయవద్దని చెప్పారు. అయితే పాఠశాలల్లో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలు ఆరోగ్య సంరక్షణకు తీసుకున్న చర్యల పై విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల పై భరోసా కల్పించాలని, ఏలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తవనే నమ్మకాన్ని వారికి కల్పించాలని,అప్పుడే ధైర్యంగా పిల్లలను పాఠశాలకు పంపిస్తారని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆర్ బి ఎస్ కె బృందాలు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేసేలా పర్యవేక్షించాలని ఆయన అక్కడి నుండే డి ఎం హెచ్ ఓ కు ఆదేశాలు జారీ చేశారు.
ఒకటిన్నర సంవత్సరాల తర్వాత పాఠశాలలు ప్రారంభమైనప్పటికి మొదటి రోజు జిల్లాలో విద్యార్థుల హాజరు బాగుందని,విద్యా శాఖ,స్థానిక సంస్థలు,గ్రామ పంచాయతీల,మున్సిపాలిటీ లు పాఠశాలను పరిశుభ్రం చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ వెంట డీఈవో ఉషారాణి, తదితరులు ఉన్నారు.

Share This Post