MBNR – బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ. దేవయ్య అన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ. దేవయ్య అన్నారు
ఒకరోజు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణకై జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా అధికారులతో సమీక్షించారు.
బాలలకు అందించే పౌష్టికాహారం, బాల కార్మిక వ్యవస్థ, పోక్సో చట్టం అమలు, జిల్లా స్థాయి బాలల హక్కుల పరిరక్షణ విభాగం పనితీరు ,బాలల ఆరోగ్యం, విద్య ,తదితర అంశాలపై ఆయన కూలంకుశంగా అధికారులతో సమీక్షించారు .
పాఠశాల పూర్వ విద్య నుండే బాలలకు వారి హక్కులను అనుభవించే విధంగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో చేరిన పిల్లలకు వారు ఆహారం తీసుకునే సామర్త్యాన్ని బట్టి ఆహారాన్ని అందించాలని, ఎలాంటి పరిమితి విధించకూడదని అన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలలో తప్పనిసరిగా విద్యుత్ సౌకర్యం ,తాగునీరు ,ఫ్యాన్లు ఉండాలని ,అదేవిధంగా ఆట స్థలాలలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే స్థానిక దాతల సహకారంతో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు. బాలికలు లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురికాకుండా పొక్సో చట్టాన్నికఠినంగా అమలు చేయాలని , పాఠశాల ,కళాశాల విద్యార్థులు,యువత అన్ని వర్గాలు వారికి ఈ విషయం పై అవగాహన కల్పించడమే కాకుండా, ప్రత్యేకంగా యువత, ఆటో డ్రైవర్లు అన్ని కమ్యూనిటీలలో కళాజాత కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో బాలల హక్కుల ను హరించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, సంరక్షించడం, ఎవరైనా బాలలపట్ల అత్యాచారానికి అఘాయిత్యానికి ఒడి కట్టినట్లయితే వెంటనే విచారణ నిర్వహించి తక్షణ చర్యలు తీసుకునేలాగా ముమ్మరంగా పని చేస్తే బాగుంటుందని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి ఇప్పటివరకు సుమారు 15 వేల పొక్సో కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. పిల్లలతో ఎక్కడ పని చేయించుకోవద్దని, అదేవిధంగా బాల్య వివాహాలు జరగకుండా నిరోధించాలని చెప్పారు.
జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం పనితీరును ఆయన సమీక్షిస్తూ ఎవరు బాలల హక్కులను హరించకుండా చూడాలని, నిర్లక్ష్యానికి గురికాబడిన పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి, అలాగే బాలల సమస్యలపై అన్ని హాస్టళ్ళు, పాఠశాలలలో ఫిర్యాదుల బాక్స్ ను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
అంతకు ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు దేవయ్యకు స్వాగతం పలుకుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
పోలీసు శాఖ తరఫున బాలల హక్కుల పరిరక్షణకై కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తున్నామని, ఆటో డ్రైవర్లు, ఇతరులకు అవగాహనలను కల్పిస్తున్నామని అదనపు ఎస్ పి రాములు తెలిపారు. అదే విధంగా పొక్సో చట్టానికి సంబంధించి కఠినంగా వ్యవహరించడమే కాకుండా, ఆరు శాతం కేసులలో శిక్షపడే విధంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు .
పిల్లల పెరుగుదల, పౌష్టికాహారం, తదితరు అంశాలపై జిల్లా సంక్షేమ అధికారిని జరీన బేగం వివరించగా ,పిల్లల ఆరోగ్య సంరక్షణ కై చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ వివరించారు.
జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం ద్వారా చేపట్టే కార్యక్రమాలలను ఆ విభాగం ఇన్చార్జ్ అధికారి నర్మద వివరించారు.
విద్యాశాఖ అధికారి రవీందర్, ఇతర అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

 

Share This Post