MBNR – భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీని తీసుకువస్తాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ వెల్లడి .

భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీని తీసుకువస్తాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
గ్రామ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించడం ద్వారా గ్రామీణ స్థాయి నుండి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీని తీసుకు రావాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనని తెలిపారు.
శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా స్టేడియంలో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు.
మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో అన్ని మౌలిక సదుపాయాలతో క్రీడా మైదానాలు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్ తో పాటు, విద్యలో కూడా క్రీడాకారులకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దేశానికి ఎంతో మంది క్రీడాకారులు అవసరమని అందుకే తమ ప్రభుత్వం క్రీడలు, పర్యాటకంపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
2014 తర్వాత క్రీడలలో ఎంతో పురోభివృద్ధి సాధించామని ,భవిష్యత్తులో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేస్తామని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ లోని ఇండోర్ స్టేడియం పూర్తయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తామని , బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్ తో పాటు,వాలీ బాల్ పోటీలు నిర్వహిస్తామని,వాలీ అకాడమీ ఇదివరకే మంజూరు అయిందని, షాట్ ఫుట్, లాంగ్ జంప్ తోపాటు, స్థలం దొరికినట్లయితే క్రికెట్ స్టేడియం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రధాన రహదారి నుండి స్టేడియం కి వచ్చే రహదారిని విస్తరిస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపూర్ వెంకటేశ్వర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ఎస్. వెంకట రావు ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,మున్సిపల్ చైర్మన్ కె .సి. నర్సింహులు, మున్సిపల్ వైస్ గణేష్ ,మాజీ వైస్ చైర్మన్ రాములు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్ ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,కౌన్సిలర్లు రామ్ లక్ష్మణ్, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Share This Post