MBNR – మట్టి వినాయకులను పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

@మట్టి వినాయకులను పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపు
మట్టి వినాయకులను ప్రతిష్టించి, పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినవారమవుతావని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలకు పంపిణీ చేశారు.
మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ వాతావరణంలో కాలుష్యం ఎక్కువైతే మానవ మనుగడకే ప్రమాదమని ,ముఖ్యంగా ఓజోన్ పొర దెబ్బతిని వివిధ రోగాలు, విచిత్రమైన రోగాలు వస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని కోరారు.
కాగా బి సి వెల్ఫేర్ శాఖ ద్వారా ఈ సంవత్సరం 1000 వినాయకులను ఉచితంగా పంపిణీ చేయగా, వచ్చే సంవత్సరం పెద్దఎత్తున మట్టి వినాయకుల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు .ఇందుకుగాను మట్టి వినాయకులను తయారు చేసే వారికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
జిల్లా ప్రజలు వినాయకచవితి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో, సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని, ముఖ్యంగా విద్యుత్ శాఖ తరఫున విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల తరఫున అన్ని వినాయక మండపాలు వద్ద డిస్ ఇన్స్పెక్షన్ చేయాలని కోరారు. వినాయక నిమజ్జనం చేసే బీచు పల్లి కృష్ణా నది వద్ద గజ ఈతగాళ్లను, క్రేన్లను ఏర్పాటు చేయాలని, ఏలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. భగవంతుడి దయవల్ల జిల్లా ఎంతో అభివృద్ధి సాధించడం జరిగిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించడమే కాకుండా అన్ని ప్రాజెక్టులు పూర్తయి ప్రజలు, రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండేలా దేవుడిని ప్రార్థించారు .
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కె .సి.నరసింహులు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, కౌన్సిలర్ గోవిందు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఎస్పీ శ్రీధర్ ,ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Share This Post