మహబూబ్ నగర్ జిల్లా పరిధి ప్రారంభంకాగానే ప్రత్యేక వాతావరణం కనిపించేలా పట్టణానికి వచ్చే అన్ని రహదారులకు ఇరు పక్కల అలాగే రోడ్డు మధ్యలో పెద్ద మొక్కలు నాటాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
జడ్చర్ల-మహబూబ్ నగర్ నాలుగు లైన్ల రహదారి విస్తరణలో భాగంగా చేపట్టిన సెంట్రల్ మీడియన్లో పెద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి శుక్రవారం అప్పన్న పల్లి సమీపంలో ప్రారంభించారు.
మొక్కలు నాటిన తర్వాత మాట్లాడుతూ జడ్చర్ల- మహబూబ్ నగర్ రహదారి పై జిల్లా కేంద్రం పరిధిలోకి రాగానే ప్రత్యేకమైన వాతావరణం కనిపించేలా పెద్దపెద్ద మొక్కలను నాటుతున్నా మని, ఇందుకుగాను కడియం నుండి పెద్ద మొక్కలు తెప్పించటం జరిగిందని తెలిపారు. జడ్చర్ల -మహబూబ్ నగర్ రహదారి తోపాటు , భూత్పూర్- మహబూబ్ నగర్ అదేవిధంగా మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చే అన్ని రహదారులకు ఇరువైపులా అలాగే మధ్యలో పెద్ద ,పెద్ద మొక్కలు నాటి పట్టణానికి మంచి శోభను తీసుకురావాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గతంతో పోలిస్తే జడ్చర్ల -మహబూబ్ నగర్ రహదారి ప్రస్తుతం ఎంతో విశాలంగా, అద్భుతంగా కనిపిస్తున్నదని అన్నారు. ఎక్కడైనా నాటిన మొక్కలు చనిపోతే తక్షణమే మార్చి కొత్త మొక్కలు నాటాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా బైపాస్ రహదారి పై కూడా మొక్కలు చనిపోయిన చోట కొత్త మొక్కలు నాటించాలని, మొక్కల వరుసలలో తేడా రాకుండా చూసుకోవాలని చెప్పారు.పట్టణం లో పెద్ద మొక్కలతో పాటు అహల్లాదాన్ని కలిగించే పూలమొక్కలు నాటనున్నట్లు ఆయన వెల్లడించారు.
మహబూబ్ నగర్ పట్టణాన్ని హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు మంత్రి వెంట ఉన్నారు.