మీ-సేవ ఆపరేటర్లు ధరణి దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. దరఖాస్తులను సంబంధిత ఆప్షన్లో మాత్రమే అప్లోడ్ చేస్తే తిరస్కరణకు గురికావని అన్నారు.
శుక్రవారం ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ధరణి దరఖాస్తుల అప్లోడింగ్ పై మీ- సేవ ఆపరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మీ-సేవ ఆపరేటర్లు ఆప్షన్లను గమనించకుండా ధరణి దరఖాస్తులు అప్లోడింగ్ లో పొరపాట్లు చేయడం వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని, దీనివల్ల అటు రైతులకు, ఇటు అధికారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. దరఖాస్తులు తిరస్కరణ కాకుండా ఉండాలంటే సరైన ఆప్షన్ లో దరఖాస్తు చేయాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా సరైన ఆప్షన్ లో కాకుండా దరఖాస్తు చేస్తే సంబంధిత మీ-సేవ ఆపరేటర్ల పై చర్యలు తీసుకుంటామని అన్నారు.
మీ- సేవ ఆపరేటర్లు ప్రభుత్వం నిర్దేశించిన రుసుమును మాత్రమే వినియోగదారుల నుండి వసూలు చేయాలని, అంతకన్నా అధిక మొత్తాలు వసూలు చేస్తే ఫ్రాంఛైస్ రాదని స్పష్టం చేశారు. తాహసిల్దార్ లు తరచూ మీ-సేవ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి దరఖాస్తుల అప్లోడింగ్ లో వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు .ధరణిలో టిఎం- 33 వచ్చిన తర్వాత దాని ఆధారంగా జాగ్రత్తగా దరఖాస్తులు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ,ఆర్డిఓ అనిల్ కుమార్, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి సత్యనారాయణమూర్తి, కలెక్టర్ కార్యాలయ ఏవో కిషన్ ,ఈడీఎం చంద్రశేఖర్, తాహసిల్దారులు, మీ-సేవ ఆపరేటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.