MBNR – మైనార్టీలలో బీదరికం పోవాలంటే చదువుపై దృష్టి పెట్టాలి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

@మైనార్టీలలో బీదరికం పోవాలంటే చదువుపై దృష్టి పెట్టాలి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
చదువుకోకపోవడం, అవగాహనలోపం కారణంగా చాలామంది అల్పసంఖ్యాక వర్గాల పిల్లలు చిన్న చిన్న పనులతో సరిపెట్టుకుంటున్నారని, అలా కాకుండా చదువుకుంటే ఉన్నత ఉద్యోగాలతో పాటు, సమాజంలో గౌరవంగా బతికేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ముఖ్యంగా స్వయం ఉపాధి పథకాలు, షాదీ ముబారక్ , మసీదులు,చర్చిల అభివృద్ధి, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మైనారిటీ పిల్లలకు విదేశీ విద్య, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ,పింఛన్లు, వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు.
సోమవారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా మతకలహాలు లేవని అన్నారు. మైనార్టీలలో ఉన్న బీదరికం పోవాలంటే విద్య చాలా అవసరమని, చదువుకున్న కుటుంబాలు అన్ని రకాలుగా బాగుంటాయని, చదువుతోనే అన్నీ వస్తాయని, అందువల్ల మైనార్టీలు వారి పిల్లల చదువు పై దృష్టి సారించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసిందని, మహబూబ్ నగర్ జిల్లాలోనే 9 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, 9 జూనియర్ కళాశాలలు ఉన్నాయని, ప్రతి సంవత్సరం 5 వేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1 లక్ష 25 వేలు ఖర్చు చేసి చదివించడం జరుగుతున్నదని తెలిపారు. అదేవిధంగా షాది ముబారక్,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,పెన్షన్లు ఇస్తున్నామని, 15 సూత్రాల కమిటీ సభ్యులు వీటన్నింటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీల గ్రేవి యార్డు కోసం 14 ఎకరాలు, క్రిస్టియన్ మైనారిటీల గ్రేవీ యార్డ్ కోసం 4 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగిందని, మసీదుల అభివృద్ధికి, నిధులు ఇస్తున్నామని, అదేవిధంగా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు జ్యూడిషల్ అధికారాలు కలిగిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. అంతేకాక విదేశీ విద్యనభ్యసించే మైనారిటీ పిల్లల కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం ఇచ్చే రుణాలు సకాలంలో వచ్చేలా కమిటీ చర్యలు తీసుకోవాలని, అదే విధంగా మైనార్టీలు వారి అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, మైనారిటీల సంక్షేమం కోసం అమలు చేసే కార్యక్రమాల అమలులో మహబూబ్ నగర్ జిల్లా ముందు ఉండాలని కోరారు.
జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మైనార్టీల స్థితిగతులలో మార్పునకై ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం కమిటీ సభ్యులు మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. మైనార్టీలు చదువుపై దృష్టి సారించాలని, ఇందుకోసం వారికి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని, చదువుతో పాటు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కలిగించే అంశాలపై కమిటీ దృష్టి సారించాలని, ఇందుకుగాను తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, అదేవిధంగా ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం లో భాగస్వామ్యం ఉన్న ఆయా శాఖల అధికారులు కూడా మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు .
జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమ కమిటీ సమావేశాన్ని ఇకపై నిరంతరం నిర్వహిస్తామని ,ముఖ్యంగా విద్య ,వైద్యం, ఆరోగ్యం వంటి విషయాలలో కమిటీ సభ్యులు దృష్టిసారించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మైనారిటీల సంక్షేమం కోసం ఏర్పాటైన ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ సభ్యులు మహమ్మద్ యూసుఫ్ బిన్ నాసర్ మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాలల్లో సరైన వసతులు లేవని, టీచర్ లతోపాటు, అటెండర్లు, స్వీపర్లు లేరని ,కొన్నిచోట్ల తాగునీరు లేదని వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
మరో సభ్యురాలు జరీనా బేగం మాట్లాడుతూ మైనార్టీలు అభివృద్ధి సాధించేందుకు ముందుగా చదువు కోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మరో సభ్యుడు శామ్యూల్ విక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ మైనార్టీలకు ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకునేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలో క్రిస్టియన్ కమ్యూనిటీ గ్రేవి యార్డు కోసం 4 ఎకరాల స్థలాన్ని కేటాయించారని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి, సభ్యులు అన్వర్ హుస్సేన్ ,సయ్యద్ అబ్దుల్ సుల్తాన్, జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.

 

Share This Post