MBNR – రాత్రి సమయంలో సైతం వ్యాక్సినేషన్ డ్రైవ్.

@రాత్రి సమయంలో సైతం వ్యాక్సినేషన్ డ్రైవ్
@చలిలో కూడా పని చేస్తున్న అన్ని శాఖల సిబ్బంది
@ అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది చలిని కూడా లెక్క చేయకుండా కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు నేతృత్వంలో రాత్రి పూట కూడా వాక్సినేషన్ చురుకుగా కొనసాగుతున్నది. నిర్ధేశించిన సమయం ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు వాక్సినేషన్ వేయాలని ఆదేశించినప్పటికి రాత్రి 10,11 గంటల సమయంలో కూడా వాక్సినేషన్ వేస్తున్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 435 గ్రామ పంచాయతీలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా గత శనివారం 18238 డోసులు, సోమవారం 24120 డోసులు, మంగళవారం 24516 డోసులు, బుధవారం ఇప్పటివరకు 22 513 డోసులు మొత్తం కిలిపి కేవలం 4 రోజుల్లోనే 89387 డోసుల వాక్సిన్ ఇవ్వటం జరిగింది. నిన్నటివరకు జిల్లాలో మొదటి డోసులు 6 లక్షల 10 వేలు రెండవ డోసులు,2 లక్షల 10 వేలు ఇవ్వటం జరిగింది. అన్ని శాఖల అధికారులు , సిబ్బంది వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేసేందుకు పట్టుదలతో కృషి చేస్తున్నారు . వాక్సినేషన్ సిబ్బంది కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ కమిషనర్లు,తహసిల్దారులు మంచి నీరు, ఆహారం, స్నాక్స్, రవాణా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు ,జిల్లా ప్రత్యేక అధికారులు ,మండల అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో అందరూ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండడంతో వాక్సినేషన్ ఇచ్చేందుకు అనువైన సమయంగా వైద్య సిబ్బందికి ఇబ్బంది లేకుండా వాక్సిన్ ఇస్తున్నారు. ఉదయం పనుల పై బయటకు వెళ్లిన వారు కూడా సాయంత్రం ఇళ్లకు చేరుకున్న తర్వాత సిబ్బంది ముందుగానే ఎవరెవరు వాక్సిన్ తీసుకోలేదో తెలుసుకొని వారి ఇళ్లకు వెళ్లి వాక్సిన్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా సర్పంచులు, మున్సిపల్ స్థాయిలో చైర్మన్లు ,వార్డు కౌన్సిలర్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేస్తూ వాక్సిన్ తీసుకోవాలని కోరుతూ దగ్గరుండి వాక్సినేషన్ వేయిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

Share This Post