రానున్న 15 రోజుల్లో ఇవ్వవలసి ఉన్న పంట ఋణాలన్నింటిని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు బ్యాంకర్లతో కోరారు.
మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు పంట రుణాలలో భాగంగా 62 శాతం రుణాలు ఇవ్వడం జరిగిందని,తక్కిన 38 శాతం కూడా త్వరగా ఇవ్వాలని ఆయన కోరారు .ఇందుకుగాను మండల స్థాయిలోని అధికారుల సహకారం తీసుకోవాలని , త్వరితగతిన రుణాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రైతులు, చిరువ్యాపారులు, స్వయం సహాయక మహిళా సంఘాల పై బ్యాంకర్లు ఎక్కువ దృష్టి కేంద్రీకరించి వారికి రుణాలు ఇవ్వాలని అన్నారు.
రైతులు పంట మార్పిడి పై కృత నిశ్చయంతో ఉండాలని, ముఖ్యంగా పూలు ,పండ్లు, కూరగాయల తోటల పెంపకం పై దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో ని భూములు ఉద్యాన సాగుకు అనుకూలంగా ఉన్నాయని,ఇతర ప్రాంతాలు, దేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా మామిడి తదితర పంటలు పండించే అవకాశం ఉన్నందున వాటివైపు ఆలోచించాలని కోరారు. అంతేకాక జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మంజూరు అయినందున ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా లాభపడే పంటలను పండించడం పై కూడా దృష్టి సారించాలని కోరారు.
జిల్లా అధికారులు ప్రభుత్వ డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకు లలో పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
వ్యవసాయ రుణాలు, రైతులకు ఇచ్చే కాలపరిమితి రుణాలు, చిరు వ్యాపారులు,ఎస్ హెచ్ జి ల కు జాప్యం లేకుండా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ పునరుద్ఘాటించారు.
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్లను నెలకొల్పడంలో బ్యాంకర్లు సహకరించాలని అన్నారు .నాబార్డు ద్వారా గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ 2022- 23 సంవత్సరానికుద్దేశించి 4755 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన మహబూబ్ నగర్ జిల్లా వనరుల ఆధారిత రుణ ప్రణాళికను విడుదల చేశారు .
ఈ ప్రణాళికలో రైతుల సంబంధించి పంట రుణాలు,కాల పరిమితి రుణాలు,వ్యవసాయ మౌలిక సదుపాయాలు,ఇతర అనుబంధ రంగాలకు కలుపుకొని మొత్తం వ్యవసాయ రంగానికి 4030 కోట్లు, ఎం ఎస్ ఎం ఈ కింద 536 కోట్ల , తక్కినది విద్య,గృహనిర్మాణం,ఇందనవనరులు ఇలా మొత్తం 4755 కోట్ల రుణ ప్రణాళికతో వనరుల ఆధారిత రుణ ప్రణాలికను రూపొందించడం జరిగింది. గత సంవత్సరపు వనరుల ఆధారిత రుణ ప్రణాళిక తో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ .
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎల్ డి ఎం నాగరాజు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, యు బి ఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాంప్రసాద్, ఏ పి గి వి బి సీనియర్ మేనేజర్ క్రాంతి, ఆర్ బి ఐ ఎ జిఎం తేజ దీప్ బేహార్, నాబార్డ్ ఏ జి ఎం శ్రీనివాస్ ,బ్యాంక్ నియంత్రణ అధికారులు, డిఆర్డిఓ యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత ,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, డి టి డి ఓ చత్రు, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి ఇందిర, ఇతర శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు .