MBNR – రాష్ట్రంలో క్రీడలు, పర్యాటకానికి ప్రాధాన్యం – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

@ రాష్ట్రంలో క్రీడలు, పర్యాటకానికి ప్రాధాన్యం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
భవిష్యత్తులో క్రీడలు, పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలను నిర్మిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనులను
శనివారం మంత్రి తనిఖీ చేశారు.
ప్రతి జిల్లా కేంద్రం లో స్టేడియం తోపాటు,అకాడమీ ల ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను చేపట్టిన్నట్లు వెల్లడించారు.
జిల్లాలో అనేకమంది క్రీడాకారులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం పొందిన వారు ఉన్నారని తెలిపారు. స్టేడియం పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.పనులు నత్త నడకన చేయవద్దని ,పనులలో వేగం పెంచాలన్నారు.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో చేపట్టిన కూడళ్ల పనులను కూడా వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ పనులన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సకాలములో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ను మంత్రి ఆదేశించారు.అధికారులు ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ద్వారా మంజూరైన పనులను సకాలంలోపూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
గతంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని ,ఇప్పుడు ఆ సమస్య లేదని, అంతేకాక విద్యుత్ సమస్య కూడా పోయిందని, రోజురోజుకు మహబూబ్ నగర్ పట్టణం రూపురేఖలు మారుతున్నాయని ,అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను విస్తరించడంతో పాటు, బైపాస్ రోడ్డు రావడం, రోడ్ల విస్తరణ చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు రహదారి విస్తరణ పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రహదారులు విశాలంగా ఉన్నప్పుడే పట్టణానికి అందం వస్తుందని, అంతేకాక ఆస్తుల విలువ పెరగడంతో పాటు, వ్యాపారం కూడా పెరుగుతుందని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజడ్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు,పి ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ , మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share This Post