రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు వెల్లడించారు.
గురువారం ఆయన మహబూబ్ నగర్ సమీపంలో ఉన్న పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో పిల్లల మర్రి పర్యాటక కేంద్రం పర్యాటకులకు అందుబాటులో లేదని, అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేనందున కరోనా నిబంధనలు పాటిస్తూ పిల్లలమర్రి , ఆర్క్యులాజికల్ మ్యూజియం, మినీ జూ, చిల్డ్రన్స్ పార్క్, సైన్స్ మ్యూజియం లను పర్యాటకులు తిలకించవచ్చని ఆయన తెలిపారు.
జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులోభాగంగానే రెండు రకాల టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నామని ,మొదటి టూరిజం సర్క్యూట్ లో ఒకరోజు మొత్తం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన మన్యం కొండ,పిల్లలమర్రి,కె సి ఆర్ అర్బన్ ఎకో పార్కులు సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అదేవిధంగా రెండు రోజుల టూరిజం సర్క్యూట్ లో భాగంగా హైదరాబాద్ నుండి వచ్చే పర్యాటకుల కోసం మొదటి రోజున మన్యంకొండ, పిల్లలమర్రి, కె సి ఆర్ అర్బన్ ఎకో పార్క్ ఉంటుందని, రెండవ రోజు కందూరు ,బీచ్ పల్లి ,గద్వాల కోట ,జూరాల ప్రాజెక్టు, అలంపూర్ దేవాలయాలు సందర్శించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా సాధ్యమైనంత త్వరలో ఒకరోజు టూరిజం సర్క్యూట్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శని, ఆడివారారాలు,సెలవు రోజుల్లో ముందుగా ఈ సర్క్యూట్ లలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని,త్వరలోనే ఇందుకు సంబంధించి ప్యాకేజ్ వివరాలు వెల్లడిస్తామన్నారు.
అంతకుముందు ఆయన పిల్లలమర్రి లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా పర్యాటక అధికారి యు.వెంకటేశ్వర్లు,డి ఎఫ్ ఓ గంగారెడ్డి, హార్టికల్చర్ అధికారి సాయిబాబా లతో
కలిసి పిల్లలమర్రి లో ఏర్పాటు చేయనున్న ఆర్కియాలజికల్ పార్క్,ఇతర పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.