MBNR – రైతు వేదికల వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

రైతు వేదికల వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
మంగళవారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదిన్నర కాలం నుండి రైతు వేదికలు వినియోగంలో ఉన్నాయని,రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2603 రైతు వేదికలను పూర్తి చేయడం జరిగిందని, రైతు వేదికలు రైతులకు శిక్షణా వేదికలుగా పని చేస్తున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు .రైతు వేదికలను శాశ్వత వేదికలుగా వినియోగించడమే కాకుండా, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులకు కొత్త కొత్త పద్ధతులు సాగు యాజమాన్యం తదితర విషయాలపై అవగాహన కల్పిస్తామన్నారు.21 శాతం స్థూల జాతీయ ఆదాయం వ్యవసాయ రంగం నుండి వస్తున్నదని మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, తెలంగాణలో లబ్ధి పొందని కుటుంబమే లేదని అన్నారు .ఇప్పటి వరకు రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు .ఇటీవలే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, నిరుద్యోగ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్దమొత్తంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రులు స్థానిక ఉన్నత పాఠశాలలో మన ఊరు- మనబడి పనులకు శంకుస్థాపన చేశారు .అంతేకాక యాదవ కమ్యూనిటీ హాల్ ను, పల్లె ప్రకృతి వనాన్ని, మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ గోపాల్ యాదవ్, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ నాగార్జున రెడ్డి, జడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారులు ,మండల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

Share This Post