ఈ స్కూల్లని చూస్తే మీరు కూడా ఈ స్కూల్స్ కి వెళ్లి చదువుకోవాలనిపిస్తుంది కదా? నిజమేనండి ఈ స్కూళ్ళు ఎంత బాగున్నాయి కదా? అలాగని ఇవి ప్రైవేట్ స్కూల్స్ కానే కాదండోయ్ పక్కా ప్రభుత్వ పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాలలు ఏంటి ఈ విధంగా కార్పొరేట్ పాఠశాలలమాదిరిగా తయారు కావటం ఏంటి అనుకుంటున్నారా ? ఆశ్చర్యమేస్తున్నది కదా! అవును మీరు చూస్తున్నది,వింటున్నది అక్షరాల నిజం. చాలా రోజుల తర్వాత కాదు కాదు సంవత్సరంన్నర మూతబడి బూజుపట్టిన పాఠశాలలను దుమ్ముదులిపి, పరిశుభ్రం చేసి, హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసి, పిచ్చిమొక్కలు తీసివేసి, పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రం చేసి, పాఠశాలల ఆటస్థలాలు, క్లాస్ రూములను గత వారం రోజుల నుండి పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి మహబూబ్ నగర్ జిల్లా లోని పాఠశాలలను ఈ విధంగా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు తెరుచుకొనున్న దృష్ట్యా విద్యార్థులు పాఠశాలలకు ఇష్టం తో వచ్చేందుకు ఖచ్చితంగా ఆకర్షిస్తాయి.
పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకునేందుకు,కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం కె జి నుండి పి జి వరకు అన్ని విద్యా సంస్థలలో పరిశుభ్ర కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. పాఠశాలలను ఇంత సుందరంగా, అందంగా ముస్తాబు చేసి విద్యార్థులకు స్వాగతం చెప్పేందుకు సిద్ధం చేయడం జరిగింది. నిజంగా ఈ పాఠశాలలను చూస్తే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో వెనక్కి వెళ్లరు. ఈ పాఠశాలలు, కళాశాలల ను చూస్తే మనకు కూడా అసూయ వేస్తున్నది. ఎందుకంటే నేను చదివే సమయంలో ఇలాంటి పాఠశాలలు లేవు కదా అని చిన్న అసూయ. అంతేకాదు అన్ని హంగులు ,అర్హులైన ఉపాధ్యాయబృందం ఉండటం వల్ల ప్రైవేట్ పాఠశాల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరతారన్నది నిజం.
ఎంతో కష్టపడి జిల్లా యంత్రాంగం అన్ని పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ లను సుందరంగా తీర్చిదిద్దటం జరిగింది. అందుకే పిల్లలూ సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలలకు వచ్చేందుకు సిద్ధంగా ఉండండి. అందుకే మరోసారి మీకు స్వచ్ఛ పాఠశాలలకు స్వాగతం! సుస్వాగతం!